వర్షాకాలం వచ్చిందంటే చాలు అక్కడి అన్నదాతల గుండెల్లో గుబులు తొలకరి మొదలైతే సంతోషప డాల్సిన రైతన్నకు దిగులు. వానొస్తే జడిసే బతుకులకు ఏంటి పరిష్కారం..? అసలు ఆ దిగులెందుకు..? వారిలో ఆ గుబులెందు..?
జూన్ మొదలైతే చాలు అన్నదాతలు వ్యవసాయ పనులకు శ్రీకారం చుడతారు. తొలకరి వానలతో దుక్కి దున్ని నారు పోసి నాట్లలో నిమగ్నమవుతారు. దీంతో పంట పొలాల్లో సందడి వాతావరణం సంతరించు కుంటుంది. అయితే అందు కు భిన్నంగా వర్షాకాలం వచ్చిందంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నదాత గుండెల్లో గుబులే. వ్యవసాయ పనులు మొదలు పెట్టాలంటే కంగారే. ఎప్పుడు గంగమ్మ ఉప్పొంగుతుం దో గోదావరి ఉగ్రరూపం దాలుస్తుందోనన్న టెన్షన్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం, చర్ల మండలాల గ్రామాలు గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నాయి. ఇక్కడ ఉండే ప్రజలంతా వ్యవసాయ ఆధారిత కుటుంబాలే. దీంతో జూన్ వచ్చిందంటే వరి, పత్తి, మినుమలు, కందులు, పెసర్లు తదితర పంటలను పండించేందుకు సమాయత్తమవుతుంటారు. కానీ ప్రతి ఏటా విత్తనాలు నాటి, నారు చేతికి వచ్చేలోగా గోదావరి ప్రవాహం పెరిగి పంట పొలాలను ముంచేత్తుతూ రైతును నట్టేట ముంచుతోంది. దీంతో పంట వేసింది మొదలు గోదావరమ్మును వేడుకుంటూనే ఉంటారు. ప్రవాహం పెరగకుండా మా పంటల్ని కాపాడు తల్లీ అంటూ బిక్కుబిక్కుమని గడుపుతుంటారు.
తెలంగాణకు సరిహద్దు రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, చత్తీస్గడ్ ప్రాంతాలలో అధిక వర్షపాతం నమోదైన ప్రతిసారి ఆ వరద అంతా గోదావరి నదిలో కలిసి ప్రవాహం పెరుగుతూ ఉంటుంది. దీని వల్ల భద్రాచలం లో 50 అడుగుల వరకు గోదావరి ప్రవహిస్తే చాలు దుమ్ముగూడెం మండలానికి చెందిన తూరుబాక ,రేగుపల్లి, నర్సాపురం, లక్ష్మీనగరం, చిన్న బండి రేవు, పెద బండి రేవు, సీతానగరంతోపాటు పలు గ్రామాల పంటలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయి రైతులకు అపార నష్టాన్ని మిగులుస్తుంది. అంతే కాకుండా ఈ వరదల వల్ల పంట పొలాల్లో భూసారం తగ్గి, మరల భూసారాన్ని పెంచేం దుకు నీటి ప్రవాహంతో వచ్చిన బురదను తొలగించి, ఎరువులు చల్లి తిరిగి పనులు ప్రారంభించాలి అంటే పని భారమే కాకుండా ఆర్థిక భారం కూడా పెరిగిపోతోందని వాపోతున్నారు గోదావరి పరివాహక ప్రాంత రైతులు.
వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్న ఈ జనం ప్రతి ఏటా గోదావరి వరదలతో నష్టాలబారిన పడుతు న్నారు. అంతేకాదు వరదల రూపంలో యమగండం పొంచి ఉండటంతో ఇటు పనులు ప్రారంభించలేక అటు వ్యవసాయాన్ని వదులుకో లేక సతమతమవుతున్నారు. దీంతో ప్రభుత్వమే తమను ఈ జల గంఢం నుంచి గట్టెక్కించాలని కోరుతున్నారు. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం వరకు సుమారు 24 కిలోమీటర్ల మేర కరకట్టను పొడిగిస్తే, తమ బతుకులు బాగు పడతాయని విజ్ఞప్తి చేస్తున్నారు. కొన్ని వేల వ్యవసాయ ఆధారిత కుటుంబాలను ఆదుకున్నవారు అవుతారని మొర పెట్టుకుంటున్నారు.మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసులు కోరుతున్నట్టు ప్రభుత్వం వారి ఆవేదనను అర్థం చేసుకుని కరకట్టును పొడగిస్తుందా..? వాన వస్తే జడిసే వారి బతుకులకు భరోసా ఇస్తుందా అనేది వేచి చూడాలి.