స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చి ఉండకపోతే కేసీఆర్ ఫ్యామిలీ నాంపల్లి దర్గా దగ్గర బిచ్చమెత్తుకునేవాళ్లని విమర్శించారు. కేసీఆర్ కుమారుడు అనే హోదా తప్పితే కేటీఆర్‌కు తెలంగాణతో ఏం సంబంధం లేదన్నారు. ప్రియాంక గాంధీపై విమర్శలు చేస్తున్న కేటీఆర్ ఆమె కాళ్లను మొక్కితే పాపాలన్నీ పోతాయని సూచించారు. దేశం కోసం బలిత్యాగాలు చేసిన కుటుంబంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఉప్పు పాతరేస్తారని హెచ్చరించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుటుంబాన్ని బీజేపీ అభ్యర్థి మణికంఠ రాథోడ్ హత్య చేస్తానని బెదిరించడం దారుణమన్నారు. ప్రధాని మోదీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాథోడ్ ను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశఆరు. ఖర్గే నేతృత్వంలో కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయఢంకా మోగించడం ఖాయమని తెలిపారు. ఖర్గే కుటుంబంపై బెదిరింపులకు పాల్పడిని రాథోడ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో రేవంత్ ఫిర్యాదుచేశారు.


