తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే ఒక్కడుగా వెలిగిపోతున్నారు. ఒకడే ఒంటరిగా అడుగేసిండంట వేలాది గుండెల్లో కొలువయ్యాడంట, అనే చందంగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు రేవంత్ రెడ్డి. తూటాల్లాంటి మాటలు ప్రత్యర్థులపై ఎడాపెడా సవాళ్లతో తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు రేవంత్ రెడ్డి. ఆ ఇమేజ్‌తోనే ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు రేవంత్ రెడ్డి. దాదాపు నాలుగు నెలల కిందట జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ను ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. అప్పటికే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా హస్తం పార్టీని గెలుపుతీరాలకు చేర్చడంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు.
ముఖ్యమంత్రి కుర్చీలో రేవంత్ రెడ్డి కుదురుకున్నారో లేదో లోక్‌సభ ఎన్నికల నగారా మోగింది. దీంతో తెలంగాణలోని మొత్తం 17 నియోజకవర్గాల్లో అత్యధిక సీట్లు గెలిపించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిపై పడింది. మెజారిటీ సీట్లలో హస్తం పార్టీని గెలిపించే బాధ్యతను రేవంత్ రెడ్డిపైనే పెట్టింది కాంగ్రెస్ అగ్రనాయకత్వం. దీంతో హైకమాండ్ తన నెత్తిమీద పెట్టిన బాధ్యతను నెరవేర్చడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు రేవంత్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఎక్కడికక్కడ హస్తం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమీక్షలు చేస్తున్నారు. ప్రతి పట్టణంలో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు.ప్రజలకు మరింత చేరువ కావడానికి రోడ్ షోలు చేస్తున్నారు.
ఎన్నికల్లో గెలవడం అంటే ఆషామాషీ విషయం కాదు. పార్టీ నాయకుల మధ్య సమన్వయం అవసరం. దీంతో జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల సమన్వయానికి టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు రేవంత్ రెడ్డి. ఈ సమన్వయ బాధ్యతలను మంత్రులకు అప్పగించారాయన. ఎప్పటికప్పుడు మంత్రులతో ఇంటరాక్ట్ అవుతూ చెప్పిన పనులు ఎక్కడివరకు వచ్చాయని అడిగి తెలుసుకుంటున్నారు. నాయకులు, కార్యకర్తలకు ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇటు గులాబీ పార్టీ అటు భారతీయ జనతా పార్టీపై ఘాటు విమర్శలు చేస్తూ ప్రచారంలో హైప్ క్రియేట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్‌ను టార్గెట్ చేశారు. కాళేశ్వరం లోపాలపై చర్చిద్దాం…రమ్మంటూ గులాబీ పార్టీ అధినేత కేసీఆర్‌కు సవాల్ విసిరారు. మెదడును ధారపోసి, రక్తాన్ని కరిగించి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించామని కేసీఆర్ గొప్పగా చెప్పుకోవడాన్ని అపహాస్యం చేశారు రేవంత్ రెడ్డి. అలాగే కాంగ్రెస్ పార్టీ వస్తూ వస్తూ రాష్ట్రంలోకి కరవును తీసుకొచ్చిందని కేసీఆర్ చేసిన విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ శీతాకాలంలో అధికారంలోకి వస్తే కరువు ఎలా తీసుకువస్తుందని కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఇదిలా ఉంటే రుణమాఫీ విషయమై గులాబీ పార్టీతో ఢీ అంటూ ఢీ అంటున్నారు రేవంత్. పంద్రాగస్టులోగా రైతులకు రుణమాఫీ చేసి చూపిస్తామన్నారు. పంద్రాగస్టులోగా తమ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తారా అంటూ హరీశ్ రావుకు రేవంత్ సవాల్ విసిరారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి. కేంద్రంలో బీజేపీ మూడో సారి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దవుతాయని ఘాటు ఆరోపణలు చేశారు. దేశ మూలవాసులైన దళితులు, ఆదివాసీలు, ఓబీసీలపై సర్జికల్ స్ట్రైక్స్ చేయడానికి బీజేపీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. బడుగు, బలహీనవర్గాలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. అంతేకాదు రాజ్యాంగాన్ని మార్చడానికే ఎన్డీయే కూటమికి 400 సీట్లు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను కోరుతున్నారంటూ బీజేపీని ఎండగట్టారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా కులగణనను తెరమీదకు తీసుకువచ్చారు రేవంత్ రెడ్డి. బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు అమలయ్యేలా చూడాలంటే కులగణన అవసరమని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందన్నారు. కులగణనతోనే బడుగు, బలహీనవర్గాలకు సామాజిక న్యాయం సాధ్యపడుతుందన్నారు. హిందూత్వ అజెండాతో ముందుకుపోతున్న బీజేపీకి కులగణన అంశం మింగుడు పడటం లేదని రేవంత్ ఘాటు ఆరోపణలు చేశారు. దీంతో సామాన్య ప్రజల్లో హస్తం పార్టీని బద్నాం చేయడానికి కమలం పార్టీ నేతలు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి.
ఇదిలా ఉంటే అత్యధిక లోక్‌సభ సీట్లలో కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందన్న ధీమా వ్యక్తం చేశారాయన. నాలుగు నెలలుగా అమలవుతున్న వివిధ ప్రభుత్వ పథకాలే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు కురిపిస్తాయన్న భరోసాతో ఉన్నారు రేవంత్ రెడ్డి. మహిళలకు ఉచిత ప్రయాణం సూపర్ డూపర్‌గా హిట్ అయింది. ఆధార్ కార్డు చూపించి ఆర్టీసీ బస్సుల్లో తెలంగాణవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణిస్తున్నారు మహిళలు. ఉచిత బస్సు ప్రయాణంతో తెలంగాణవ్యాప్తంగా మహిళలందరూ తమ పార్టీకి ఓట్ బ్యాంక్‌గా మారార న్నారు రేవంత్ రెడ్డి. కాగా ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన నెల రోజుల్లోనే రేవంత్ రెడ్డి పాలనలో తనదైన ముద్ర వేశారు. తెలంగాణ పాలనను గడీల నుంచి ప్రజల వద్దకు తీసుకువచ్చారు. పాలనలో కొత్త ఒరవడికి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఏ ప్రభుత్వానికి అయినా విధాన నిర్ణయాలే ముఖ్యం. ఇంతటి కీలకమైన విధాన నిర్ణయాలు తీసుకునేటప్పుడు సహజంగా పాలకులు ఒంటెత్తు పోకడలు పోతుంటారు. అధికారంలో ఉన్నాం కాబట్టి, తమకు అన్నీ తెలుసునన్న అహంకారంతో ప్రవర్తిస్తుంటారు. అయితే రేవంత్ రెడ్డి ఈ ధోరణికి పూర్తిగా భిన్నం. ప్రభుత్వ పరంగా ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు. ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ ఇటీవల హైదరాబాద్ వచ్చి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి 15 సీట్లు టార్గెట్‌గా ఫిక్స్ చేశారు. ఈ టార్గెట్ చేరుకోవడానికి కాంగ్రెస్ వర్గాలను అన్ని వైపుల నుంచి మొహరిస్తున్నారు రేవంత్ రెడ్డి.


