స్వతంత్ర వెబ్ డెస్క్: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరికకు ముహూర్తం కుదిరింది. జులై 2న ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇతర సీనియర్ నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు సంబంధిత సర్కిళ్ల ద్వారా కార్యక్రమాన్ని ఖరారు చేశారు. అంతకు ముందు ఈ నెల 25న ఢిల్లీలో రాహుల్ గాంధీతో ఈ నేతలిద్దరూ సమావేశమై చర్చిస్తారని, 26న ఢిల్లీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించనున్నారని సమాచారం. ఈ మేరకు ప్రణాళిక ఖరారైనట్టు తెలుస్తోంది.
ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీలో జూపల్లి, పొంగులేటి చేరికల విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగిన నేపథ్యంలో.. కోమటిరెడ్డితో భేటీతో భేటీ అయిన రేవంత్ రెడ్డి తర్వాత మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి పనిచేస్తానని స్పష్టం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి జూపల్లి, పొంగులేటి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ మర్యాదపూర్వకంగా ఆహ్వానిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. పార్టీలో సీనియర్ నేతలు అందరినీ కలుపుకుని వెళతామని మరోసారి స్పష్టం చేశారు.