ఒకప్పుడు కేంద్రప్రభుత్వం, సైనిక్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నడిచిన సైనిక్ స్కూళ్ల నిర్వహణను ఆర్ ఎస్ఎస్, బీజేపీ నాయకుల పరం చేస్తున్నారా? సైనిక్ స్కూళ్లకూ మతరంగు పులుముతున్నారా? సీబీఎస్ సీ, ఐసీఎస్ ఈ ల సిలబస్ మార్చేందుకు ఓ పద్ధతి ప్రకారం ప్రయత్నించిన కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు సైనిక స్కూళ్లపైనా కన్నేసిందా.. సైన్యానికీ మతం రంగు పులిమేందుకు సిద్ధమౌతోందా.. అంటే.. అది నిజమేనని రిపోర్టర్స్ కలెక్టివ్ నివేదిక స్పష్టం చేసింది.
సైనిక్ స్కూళ్లకు గొప్ప చరిత్ర ఉంది. సైనిక్ స్కూళ్లు సాంప్రదాయంగా స్వతంత్ర ప్రతిపత్తి గల సైనిక్ స్కూల్ సొసైటీ ఆధ్వ ర్యంలో నడిచేవి. ఈ స్కూళ్లలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు మతాలకూ అతీతంగా నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ నావెల్ అకాడమీ వంటి వాటిలో చేరేవారు. 2021 లో, కేంద్రం భారతదేశంలో సైనిక్ పాఠశాలలను నిర్వహిం చడానికి ప్రైవేట్ సంస్థలకు తలుపులు తెరిచింది. ఆ సంవత్సరం వారి వార్షిక బడ్జెట్లో, భారతదేశం అంతటా 100 కొత్త సైనిక్ పాఠశాలలను ఏర్పాటు చేసే ప్రణాళికలను ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్ 12, 2021 న, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఈ స్కూళ్లను “ప్రస్తుత సైనిక్ స్కూళ్లకన్నా భిన్నంగా ప్రత్యేక పద్ధతుల్లో నడపాలనే ప్రతిపాదనను ఆమోదించింది. రిపోర్టర్స్ కలెక్టివ్ ఓ నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ పత్రికా ప్రకటనలు, సమాచార హక్కు సమాధానాల నుంచి సేకరించిన సమాచారం ఆందోళనకర ధోరణిని సూచిస్తోందని నివేదిక పేర్కొంది.
ఇప్పటివరకు జరిగిన 40 సైనిక్ స్కూల్ ఒప్పందాల్లో కనీసం 62శాతం సైనిక్ స్కూళ్లను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, దాని అనుబంధ సంస్థలు, భారతీయ జనతా పార్టీ కి చెందిన రాజకీయ నాయ కులు, దాని రాజకీయ మిత్రపక్షాలు, హిందుత్వ సంస్థలు, వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయించినట్లు రిపోర్టర్స్ కలెక్టివ్ నివేదిక స్పష్టం చేసింది. ఒకప్పుడు సీబీఎస్ సీ ఆధ్వర్యంలో నడిచిన సైనిక్ స్కూళ్లను బీజేపీ,ఆర్ఎస్ ఎస్ నాయకులకు అప్పగించడం పట్ల వివాదం చెలరేగింది. చాలా మంది మేథావులు కేంద్ర ప్రభుత్వం చర్యను తప్పుపట్టారు. సైన్యానికి కూడా మతపరమైన రంగు పులిమేందుకు కుట్ర పన్ను తున్నారని కాంగ్రెస్, కమ్యూనిస్ట్ , ఇతర ప్రతిపక్షపార్టీలు దుమ్మెత్తి పోస్తున్నాయి. దాదాపు 62 శాతం కొత్త సైనిక్ స్కూళ్లను బీజేపీ – ఆర్ ఎస్ ఎస్ నాయకులకు.. బీజేపీతో సన్నిహిత సంబంధాలున్న వ్యక్తు లకు కేంద్రం లోని నరేంద్రమోదీ సర్కార్ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిం చింది.
సైనిక్ స్కూళ్ల నిర్వహణ బాధ్యతలు అప్పగించిన వారిలో ఆర్ఎస్ఎస్ , బీజేపీలతో సంబంధం ఉన్న వారి పేర్లను కూడా కాంగ్రెస్ విడుదల చేసింది. వారిలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ, యూపీ బీజేపీ నాయకురాలు సాధ్వి రితంభర,యుపీ బీజేపీ ఎమ్మెల్యే సరితా భదౌరియా, రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే మహంత్ బాలక్ నాథ్ యోగి, బీజేపీ నేతలు రాధాకృష్ణ విఖే పాటిల్, బీజేపీ ఎమ్మెల్యే హరిరామ్ రాన్వా, మహారాష్ట్ర మాజీ మంత్రి సద్భావు ఖోట్, మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ పాఠక్ భార్య నిధి పాఠక్, గుజరాత్ బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ భావ్సాంగ్భాయ్ చౌదరి, గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ శంకర్ చౌదరి ఉన్నారని ఆ జాబితా పేర్కొంది.
సైనిక్ స్కూళ్లను మతతత్వీకరించడం తక్షణమే ఆపాలని సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. సాయుధ దళాల లౌకిక ప్రమాణాలను నాశనం చేసేందుకు పన్నిన కుట్రలో భాగంగానే.. సైనిక్ స్కూళ్లను ఆర్ ఎస్ ఎస్, బీజేపీ నేతల పరం చేస్తున్నారని, పూర్తిగా కమర్షియలైజ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మోదీ ప్రభుత్వం వెంటనే ఈ ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసారు. ఈ వార్త పట్ల ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తూ పలువురు మేథావులు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. కాగా, కొత్త సైనిక్ స్కూళ్లను రాజకీయ నాయకులకు, మతాలతో అనుబంధంగల సంస్థలకు కేటాయించారని వచ్చిన వార్తలను రక్షణ మంత్రిత్వ శాఖతోసిపుచ్చింది. ఈ అంశంపై కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు నిరాధారమైనవని ఆ ప్రకటనలో పేర్కొంది. సైనిక స్కూళ్లు నడిపే సంస్థల ఖరారుకు స్పష్ట మైన, కఠిన మైన ప్రక్రియ అనుసరించినట్లు రక్షణ శాఖ ప్రకటనలో తెలిపింది.


