పార్లమెంట్ ఎన్నికలకు మరోసారి కాంగ్రెస్ శంఖం పూరించేందుకు సిద్ధమైంది. లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టో ను తుక్కుగూడ వేదికగానే విడుదల చేయాలని కాంగ్రెస్ అగ్రనాయకత్వం నిర్ణయించింది. రేపు తుక్కు గూడలో జన జాతర పేరిట నిర్వహించే భారీ బహిరంగ సభలో మేనిఫెస్టోతో పాటు తాము అధికారంలోకి వస్తే అమలు చేయనున్న ఐదు గ్యారంటీలను కాంగ్రెస్ అగ్రనాయకత్వం ప్రకటించనుంది. తుక్కుగూడలోని 60 ఎకరాల విశాలమైన మైదానంలో జన జాతర బహిరంగ సభను కాంగ్రెస్ నిర్వహించనుంది. మైదానం పక్కనే వాహనాల పార్కింగ్ కోసం సుమారు 300 ఎకరాల స్థలాన్ని అందుబాటులో ఉంచింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు ,200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ సరఫరా, 500 లకే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంది.
రేపు తుక్కుగుడా వేదికగా జరగబోయే జన జాతర సభకు ఆదిలాబాద్ మొదలు అలంపూర్ వరకు జహీరాబాద్ నుంచి భద్రాచలం వరకు…..అన్ని గ్రామాలు, పట్టణాలు , నగరాల నుంచి ప్రజలను పెద్ద ఎత్తున తరలించేందుకు పార్టీ సిద్ధమవుతుంది. ఈ సభకు దాదాపు 10 లక్షల మంది ప్రజలను సమీకరించాలని పార్టీ అంచనాలు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి , పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పటికే తుక్కుగూడ జన జాతర సభ ప్రాంగణాన్ని సందర్శించి సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎంత పెద్ద మొత్తంలో ప్రజల సభకు తరలి వచ్చినా ఎటువంటి లోటుపాట్లు జరగకుండా చూడాలని నేతలకు రేవంత్ ఆదేశించారు.తుక్కుగూడ నుంచే రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ సమర శంఖం పూరించింది. సెప్టెంబర్ 17న తుక్కుగూడలో విజయభేరి పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలోనే కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఆరు గ్యారంటీలను ప్రకటించారు. ఆమె ప్రకటించిన గ్యారంటీలను తెలంగాణ ప్రజలు నమ్మడంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు. దీంతో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. ఈ క్రమంలోనే కలిసి వచ్చిన తుక్కుగూడ గడ్డపై మరోసారి లోక్ సభ ఎన్నికలకు సమర శంఖం పూరించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది.


