స్వతంత్ర వెబ్ డెస్క్: ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం జరిగింది. అసలు ఈ ప్రమాదానికి సాంకేతిక సమస్య కారణమా..? మానవ తప్పిదమా అనే ప్రశ్న తలెత్తుతోంది. సిగ్నల్ వ్యవస్థలో లోపం కారణంగా ఈ తప్పిదం జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ సమాచార లోపం సాంకేతిక సమస్యతో జరిగిందా? లేదా మానవ తప్పిదమా?అనేది తెలియాల్సి ఉంది.
ఈ ప్రమాదంపై ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా ఇదే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ‘‘సిగ్నలింగ్ వ్యవస్థ విఫలం కావడం వల్లే ప్రమాదం జరిగిందంటే నమ్మలేకపోతున్నాం. దీని వెనుక ఇంకేమైనా కారణముందా?’’ అని టీఎంసీ నేత ఆరోపించారు. అత్యంత రద్దీగా ఉండే ఈ మార్గంలో ‘కవచ్’ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
రైలు ప్రమాదాలను నివారించేందుకు రైల్వే శాఖ దేశవ్యాప్తంగా ‘కవచ్’ పేరుతో యాంటీ కొలిజన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తోంది. రెడ్ (డేంజర్) సిగ్నల్‌ను పట్టించుకోకుండా లోకో పైలట్ అలాగే రైలును తీసుకెళుతుంటే.. ఈ కవచ్ వ్యవస్థతో ఆటోమెటిగ్గా బ్రేకులు పడతాయి. పట్టాలు బాగా లేనప్పుడు, ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు, ఎదురెదురుగా రైళ్లు వస్తున్నప్పుడు గుర్తించి ఇది ఆపుతుంది. దీంతో రైళ్లు ఢీకొనే ప్రమాదాలను నిలువరించొచ్చు. అయితే ప్రస్తుతం ఈ కవచ్ వ్యవస్థ దేశంలో కొన్ని మార్గాల్లోనే అందుబాటులోకి వచ్చింది. తాజాగా ప్రమాదం జరిగిన మార్గంలో ఈ కవచ్ వ్యవస్థను ఇంకా తీసుకురాలేదని రైల్వే అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ వెల్లడించారు.