రియల్ ఎస్టేట్ బ్రోకర్‌పై ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రియల్టర్‌ను చెంపదెబ్బ కొట్టారు. మేడ్చల్ జిల్లా పోచారంలో జరిగిందీ ఘటన. పేదలను ఇబ్బందులు పెడుతున్నారన్న ఫిర్యాదుతో అనుచరులతో పాటు వచ్చిన ఎంపీ ఈటల.. రియల్టర్‌ను చెంపదెబ్బ కొట్టారు. పేదల భూములను కబ్జా చేసి బెదిరిస్తున్నారంటూ ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటల చెంపదెబ్బ కొట్టాక రెచ్చిపోయిన అనుచరులు రియల్టర్‌ను చితకబాదారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఈటల.. 40, 50 గజాల స్థలంలో కట్టుకున్న పేదల ఇళ్లను కూలగొడుతున్నారని.. 50వేల నుంచి 2 లక్షల వరకు ఇస్తే తప్ప పేదలు రేకుల షెడ్లు వేసుకునే పరిస్థితి లేదని అన్నారు. దీనిపై రెవెన్యూ మంత్రి, కలెక్టర్, సీపీతో మాట్లాడానని.. ఆరు నెలల నుంచి కూల్చివేతలు, కన్నీళ్లు, బెదిరింపులు, దౌర్జన్యాలు తప్ప ఏమీ లేవని అన్నారు. తమ ప్రాణాలకు రక్షణ లేదని పేదలు కన్నీళ్లు పెడుతున్నారని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు.