స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: దళితులు, గిరిజనుల భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలను ఆపాలని, వారికి ఉన్న కనీస జీవనాధారాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్ కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ లేఖను రాశారు. లేఖలో అనేక విషయాలను ప్రస్తావిస్తూ.. ఎన్నో ఏళ్ల క్రితం దళితులకు, గిరిజనులకు అసైన్ చేసిన భూములకు మీ ప్రభుత్వం రక్షణ కల్పించకపోగా, వారి జీవనాధారాన్ని దెబ్బతీస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రోత్సహించడం దుర్మార్గమని తెలిపారు. దళితులకు, గిరిజనులకు మూడు ఎకరాల సాగుభూమి ఇస్తామన్న హామీని మీ ప్రభుత్వం వమ్ము చేయడంతో లక్షలాది మంది దళితులు, గిరిజనుల ఆశలు అడియాసలయ్యాయి. దళితులు, గిరిజనుల పట్ల మాత్రం తీవ్ర వివక్ష చూపిస్తున్నారు. దళితుల సంక్షేమమంటే ఎత్తైన విగ్రహాలు, పాలనా భవంతులకు పేర్లు కాదు. వారికి జీవనోపాధి కల్పించడమే ముఖ్యమని తెలిపారు. మీ పాలనలో దళితులు, గిరిజనలు అన్ని విధాల తీవ్రంగా నష్టపోయారని.. వారికి ఏ మాత్రం రక్షణ లేకుండా పోయిందని పేర్కొన్నారు.