జనసేన రెబల్ ఎమ్మెల్యే, వైసీపీ మద్దతుదారుడు రాపాక వరప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 సాధారణ ఎన్నికల్లో దొంగ ఓట్లతోనే తాను ఎమ్మెల్యేగా గెలిచానని స్పష్టంచేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిలో ఈనెల 24న వైసీపీ ఆత్మీయసమావేశం జరిగింది. ఆ సమావేశంలో రాపాక మాట్లాడుతూ పూర్వం నుంచి తన సొంత గ్రామం చింతలమోరిలో తనకు భారీగా దొంగ ఓట్లు పడ్డాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 20 మంది దాకా వచ్చి ఒక్కొక్కరూ 5 నుంచి 10కి పైగా దొంగ ఓట్లు వేసేవారని.. దీంతో తనకు 800ఓట్లకు పైనే మెజారిటీ వచ్చేదని తెలిపారు. అప్పటి నుంచి తన గెలుపునకు దొంగ ఓట్లే కారణమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాపాక మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది. వీడియో వైరల్ అవ్వడంతో ప్రతిపక్ష నేతలు రాపాకను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. కాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ రూ.10 కోట్లు ఆఫర్ చేసిందనే వ్యాఖ్యలు కూడా పెద్ద దుమారం రేపాయి.