స్వతంత్ర వెబ్ డెస్క్: నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం అట్టహాసంగా జరుగుతోంది. నూతన భవనాన్ని ప్రారంభించిన ప్రధాని అనంతరం పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అధికారమార్పిడికి గుర్తుగా ఉపయోగించే చారిత్రత్మక రాజదండం ‘సెంగోల్’ను కొత్త పార్లమెంట్ భవనంలోని స్పీకర్ పోడియం వద్ద ప్రతిష్టించారు. తమిళ సంప్రాదాయానికి చెందిన ఈ సెంగోల్ కు కేంద్ర ప్రభుత్వం పెద్ద పీటవేసింది. నిన్న ఢిల్లీ చేరుకున్న తమిళ ఆధీనం పూజారులు సెంగోల్ ను ప్రధాని నరేంద్రమోడీకి వేదమంత్రాల ఆశిర్వచనంతో అందచేశారు.
స్వాతంత్రోద్యమం అనంతరం బ్రిటీష్ పాలకులకు, భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు మధ్య అధికార బదలాయింపునకు గుర్తుగా ఈ రాజదండం నిదర్శనంగా నిలిచింది. ఈ రాజదండాన్ని ‘సెంగోల్’ అని అంటారు. ఇది తమిళ పదం. చోళ రాజుల కాలం నుంచి ఈ రాజదండం సంప్రదాయంగా వస్తోంది.
ఇదిలా ఉంటే తమిళ సాంప్రదాయ చిహ్నానికి భారత ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంపై సూపర్ స్టార్ రజినీకాంత్ స్పందించారు. తమిళ శక్తికి సాంప్రదాయ చిహ్నం సెంగోల్. ఇది ఇప్పుడు కొత్త పార్లమెంటులో మరింత ప్రకాశిస్తుంది. ఈ సందర్భంగా తమిళులు గర్వపడేలా చేసిన ప్రధాని నరేంద్ర మోడీకి హృదయపూర్వక ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు రజనీకాంత్.