నేడు ఐపీఎల్‌లో అగ్ర జట్ల మధ్య మరో ఆసక్తికర సమరం జరగనుంది. అగ్రస్థానంలో ఉన్న కోల్‌కత్తా, రెండో స్థానంలో ఉన్న రాజస్థాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. రాత్రి 7 గంటల 30 నిమిషాలకు అస్సాం లోని బర్సపరా స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శనలతో రెండు జట్లు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాయి. కోల్‌కత్తా అగ్రస్థానంలో ఉండగా, రాజస్థాన్ పట్టికలో రెండో స్థానంలో ఉంది.
కోల్‌కత్తాకు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. సునీల్ నరైన్ దూకుడుగా ఆడుతున్నాడు. శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రఘువంశీ, రమణదీప్ సింగ్, రింకూ సింగ్ వంటి బ్యాటర్లు ఉన్నారు. కోల్‌కత్తాకు ఆండ్రీ రస్సెల్ ఉన్నాడు. మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, వైభవ్ అరోరాలతో కోల్‌కత్తాకు బలమైన బౌలింగ్ ఉంది.ఇక రాజస్థాన్ జట్టు కూడా బ్యాటింగ్, బౌలింగ్‌లో బలంగా ఉంది. కోల్‌కత్తాతో జరిగిన ఓ మ్యాచ్‌లో జోస్ బట్లర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఓటమి ఖాయమని అనుకున్న మ్యాచ్‌లో వీరోచిత శతకంతో ఒంటి చేత్తో రాజస్థాన్‌కు విజయం అందించాడు. మిగతా బ్యాటర్‌లు ఎవరూ మద్దతు ఇవ్వకపోయినా చివరి వరకు క్రీజ్‌లో నిలిచి తన జట్టును గెలిపించాడు. ఇప్పటి వరకూ ఐపీఎల్‌లో కోల్‌కత్తా, రాజస్థాన్ 29 మ్యాచుల్లో తలపడ్డాయి. అందులో కోల్‌కత్తా 14 విజయాలు నమోదు చేయగా రాజస్థాన్ 14 విజయాలు నమోదు చేసింది. ఒక మ్యాచులో ఫలితం తేలలేదు. సమవుజ్జీలుగా ఉన్న ఈ జట్ల మధ్య ఫలితం మరింత రసవత్తరంగా మారింది.


