30.3 C
Hyderabad
Friday, March 13, 2026
spot_img

రెండో విడత పోలింగ్ కు సిద్ధమైన రాజస్థాన్

      రాజస్థాన్‌లో మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. రెండో విడతలో భాగంగా 13 నియోజకవ ర్గాల్లో  పోలింగ్ నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఒకవైపు భగభగమండే ఎండలు.. . అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే రాజస్థాన్‌ ఓటర్లు రెండో విడత పోలింగ్‌కు సిద్ధం అయ్యారు. రాజస్థాన్‌లో కొన్ని నెలల కిందట అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది.రాజుల కోటగా పేరొందిన రాజస్థాన్‌ మొదట్నుంచి కమలం పార్టీకి పెట్టనికోటలా ఉంది. రాజస్థాన్‌లో 2014,2019 ఎన్నికల్లో మొత్తం 25 స్థానాలను ఎన్డీయే గెలుచుకుంది. అంటే క్వీన్‌ స్వీప్ అన్నమాట. ఈసారి కూడా మొత్తం పాతిక సీట్లను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి.

రాజస్థాన్ ఓటర్లు విభిన్నమైన సంస్కృతికి ప్రతీక. రాజస్థాన్ లో ఐదేళ్ల కొకసారి రాష్ట్ర ప్రభుత్వం మారే సంస్కృతి ఉంది. కొన్ని దశాబ్దాలుగా ఒక టర్మ్ అధికారంలో ఉన్న పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. కానీ లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం 2014 నుంచి పూర్తిగా బీజేపీ కూటమికే మద్దతు ఇస్తూ వచ్చారు ఓటర్లు. 2014లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసినప్పుడు రాజస్థాన్ లో బీజేపీకి చెందిన వసుంధరా రాజే ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే 2019 నాటికి రాజస్థాన్ రాజకీయ స్వరూపం మారిపోయింది. అప్పటికి రాష్ట్రంలో అశోక్ గెహ్లాట్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అయినప్పటికీ, లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఎన్డీయే కూటమి క్లీన్ స్వీప్ చేసింది. ఇదొక విశేషం. కిందటేడాది జరిగిన రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. తొలిసారి ఎమ్మెల్యే అయిన భజన్ లాల్ శర్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ముఖ్యమంత్రి హోదాలో లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకం గా తీసుకున్నారు భజన్‌లాల్ శర్మ. రాజుల కోటలో బీజేపీని గెలిపించే బాధ్యతను నెత్తిన వేసుకుని రాష్ట్రం అంతా సుడిగాలి ప్రచారం చేశారు. మొత్తం పాతిక సీట్లు తమవే అంటున్నారు.

   రాజస్థాన్ లో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. చాలా మంది ఇప్పటికే బీజేపీ శిబిరంలోకి చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత దాదాపు ఎనిమిది వేలమంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కాషాయం కండువా కప్పుకున్నారు. ఎన్నికల్లో ఒటమి భయంతో పోటీకి సీనియర్లు సిద్ధంగా లేరు. అయినప్పటికీ, అశోక్ గెహ్లోట్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ నాయకత్వం 25 సీట్లలోనూ అభ్యర్థులను నిలిపింది. దీంతో బీజేపీ – కాంగ్రెస్ మధ్య ప్రత్యక్ష పోరు మొదలైంది. కాగా బీఎస్పీ, స్థానిక రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీలు కూడా లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులను నిలిపాయి. అయితే వాటి పోటీ నామమాత్రమే. ఇదిలా ఉంటే రాజస్థాన్‌లో బీజేపీ దూకుడుకు బ్రేకులు వేయడానికి కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరి స్తోంది. మొత్తం 25 సీట్లను కమలం పార్టీ ఎగరేసుకుపోకుండా అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. కనీసం కొన్ని సీట్లయినా దక్కించుకోవాలని ఆరాటపడుతోంది. ఈ వ్యూహంలో భాగంగా జాతీయ అంశాలను పక్కన పెట్టింది హస్తం పార్టీ. స్థానిక అంశాలనే అజెండాగా చేసుకుని జనంలోకి వెళ్లింది.

   భజన్‌లాల్ శర్మ ప్రభుత్వ రద్దు చేసిన సంక్షేమ పథకాలను టార్గెట్‌ చేసుకుంది హస్తం పార్టీ. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఉండగా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు జరిగాయన్నారు కాంగ్రెస్ నాయకులు. భజన్‌లాల్ శర్మ నాయకత్వంలో వచ్చిన బీజేపీ సర్కార్, అనేక సంక్షేమ పథకాలను కుదించిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. మరికొన్ని సంక్షేమ పథకాలను పూర్తిగా రద్దు చేశారని మండిపడ్డారు. ప్రధానంగా యాభై వేల మంది నిరుద్యోగ యువతకు నెలకు ఐదు వేల రూపాయలు ఇచ్చే పథకాన్ని బీజేపీ సర్కార్ రద్దు చేసిందని నిప్పులు చెరిగారు కాంగ్రెస్ నేతలు. ఇందుకు నిరసనగా యువత రోడ్ల పైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నా బీజేపీ సర్కార్‌లో ఎటువంటి చలనం లేదన్నారు కాంగ్రెస్ అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. రాజస్థాన్‌లో వందరోజుల బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రచార అస్త్రాలుగా చేసుకుంది హస్తం పార్టీ. భజన్‌లాల్ శర్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక వంద రోజుల్లో కార్యాచ రణ ప్రణాళికను అమలు చేస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా ఆహారం- పౌర సరఫరాలు, వైద్యం- ఆరోగ్యం, ఇంధన రంగాలపై ఆయన తమ ప్రభుత్వ ప్రణాళికను వెల్లడించారు. అయితే వీటిలో కనీసం 30 శాతం కూడా పూర్తి కాలేదు. ఈ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది హస్తం పార్టీ.

   రెండో విడతలో పోటీ చేస్తున్న ప్రముఖుల్లో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఉన్నారు. బీజేపీ టికెట్‌పై బిర్లా పోటీలో ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఓం బిర్లా కోట నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. లోక్‌సభ స్పీకర్‌గా బిజీగా ఉండి కూడా కోట నియోజకవర్గం సమస్యలను పరిష్కరించడా నికి తాను శాయశక్తులా ప్రయత్నించానన్నారు. ప్రజల ఆదరాభిమానాలతో ఈసారి కూడా గెలుపు తనదేనన్నారు ఓం బిర్లా. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రహ్లాద్ గుంజాల్ పోటీ చేస్తు న్నారు. ప్రహ్లాద్ గుంజాల్ రాజస్థాన్‌లోని బలమైన గుజ్జర్ సామాజికవర్గానికి చెందిన నాయకుడు. ఆయన గతంలో కొంతకాలం కమలం పార్టీలో ఉన్నారు. ఆ తరువాత బీజేపీకి గుడ్‌బై కొట్టి, కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొత్తంమీద రెండో విడత ఎన్నికల్లో కనీసం కొన్ని సీట్లలో అయినా సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందులో భాగంగా ఐదు నియోజకవర్గాలపై ప్రత్యేక ద్రుష్టి పెట్టింది హస్తం పార్టీ.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్