ఎస్‌ఎస్ రాజమౌళి.. ఆ పేరులోనే ఓ వైబ్రేషన్ ఉంటుంది. దర్శక ధీరుడు, పాన్ ఇండియా దర్శకుడిగా పేరు పొందారు. తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటి వ్యాపింపచేసిన దర్శకులు ఎవరైనా ఉన్నారంటే మొదటి పేరు రాజమౌళినే చెబుతారు. బాహుబలి సినిమాతో భారత్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపచేసిన వ్యక్తి ఆయన. ఆయనతో పాటు ఆయన సినిమాల్లో నటించిన హీరోలు, హీరోయిన్లకు కూడా ఆయన స్థాయిలోనే క్రేజ్ ఏర్పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
అలాంటి రాజమౌళి ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు. జక్కన్నపై స్వయంగా ఆయన స్నేహితుడే తీవ్ర ఆరోపణలు చేశారు. రాజమౌళి టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకుంటానంటూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు.
రాజమౌళి స్నేహితుడి పేరు యు. శ్రీనివాసరావు. రాజమౌళికి, ఆయనకు మధ్య దాదాపు 34 ఏళ్ల స్నేహ బంధం ఉంది. యమదొంగ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించారు శ్రీనివాసరావు. సెల్ఫీ వీడియో, లెటర్ ను రాజమౌళి సన్నిహితులకు పంపారు శ్రీనివాసరావు. రాజమౌళి టార్చర్ భరించలేకపోతున్నానంటూ వీడియోలో తెలిపారు. తాను ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. వీటి ఆధారంగా రాజమౌళిపై సుమోటో కేసు నమోదు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారాయన. రాజమౌళికి లై డిటెక్టర్ టెస్ట్ చేయాలని కూడా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. దీంతో ప్రస్తుతం పాన్ ఇండియా దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి వివాదంలో చిక్కుకున్నట్లైంది.