తెలంగాణలో వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని చెప్పింది. నేటి నుంచి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ప్రకటించింది. దీంతో రాష్ట్ర ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈశాన్య రుతుపవనాలు క్రమంగా దక్షిణంవైపు పయనిస్తున్నాయన్నారు. ప్రస్తుతానికి అవి తెలుగు రాష్ట్రాలకు తాకకపోయినా.. బంగాళాఖాతంలో ఓ అల్పపీడనం ఉందని చెప్పారు. ఇది బంగ్లాదేశ్, బెంగాల్ తీరాలను ఆనుకొని ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక అరేబియా సముద్రం దగ్గర కూడా ఓ తుపాను తరహా వాతావరణం ఉందని చెప్పారు. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని అన్నారు.
నేడు వనపర్తి, నారాయణపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్‌తో పాటు జోగులాంబ గద్వాల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, నాగర్ కర్నూర్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. భారీ ఈదురు గాలులతో పాటుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందన్నారు. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రేపు గద్వాల్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.