మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇవాళ హైదరాబాద్‌కు రానున్నారు. ఈరోజు సాయంత్రం ఆయన హైదరాబాద్ కు చేరుకోనున్నారు. రేపటి నుంచి తెలంగాణలో కులగణన ప్రారంభం కానున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ వివిధ వర్గాల వారితో సమావేశం కానున్నారు. మేధావులు, వివిధ సామాజికవర్గాల సలహాలు, సూచనలను స్వీకరించేందుకు రాహుల్ గాంధీ హైదరాబాద్ కు రానున్నారు.
బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్ లో రాహుల్ గాంధీ సాయంత్రం ఐదు గంటలకు కులగణనపై నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. అనంతరం తిరిగి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. రాహుల్ గాంధీ హైదరాబాద్ కు వస్తున్న సందర్భంగా పెద్దఎత్తున కాంగ్రెస్ నేతలు స్వాగత కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ముఖ్యనేతలతో రాహుల్ గాంధీ సమావేశమయ్యే అవకాశముంది. తాజా రాజకీయ పరిణామాలపై ఆయన చర్చించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి.
రాహుల్ గాంధీతో మాట్లాడేందుకు 400 మందికి అవకాశం ఇచ్చారు. ఇందులో 200 మంది పార్టీలోని వివిధ స్థాయి నేతలు ఉన్నారు. 200 మందిలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వివిధ రాష్ట్రస్థాయి కార్పొరేషన్ ఛైర్మన్లు, డీసీసీ అధ్యక్షులు ఉన్నారు. మిగతా 200 మందిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారితో పాటు రిటైర్డ్ జడ్జిలు, ప్రొఫెసర్లు, కవులు, కళాకారులు, మేధావులు ఉంటారని పీసీసీ ప్రకటించింది. ఇప్పటికే రాహుల్ గాంధీ కాన్వాయ్ వెళ్లే దారిలో భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో 500 ల మందితో బైక్ ర్యాలీ కూడా నిర్వహించనున్నారు.