వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి మధ్యంతర బెయిల్ ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో సీబీఐ మరింత దూకుడు పెంచింది. వివేకా హత్య జరిగిన సమయంలో కడప ఎస్పీగా పనిచేసిన రాహుల్ దేవ్ శర్మను హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి పిలిపించుకుంది. దాదాపు గంటపాటు సీబీఐ కార్యాయలంలో ఉన్న ఆయన కేసు వివరాలు అధికారులకు అందజేశారు. ఈ క్రమంలో ఆయన్ను పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. వివేకా హత్య కేసులో గతంలో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందంలోనూ రాహుల్ సభ్యుడిగా ఉన్నారు. హత్యాస్థలంలో లభించిన ఆధారాలను కుటుంబసభ్యులు రాహుల్ దేవ్‌కు అందజేశారు. వాటిపై సీబీఐ అధికారులు ఆయనను ఆరా తీశారు.
మరోవైపు ఈ కేసులో అరెస్టైన కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్ రెడ్డిల సీబీఐ కస్టడీ నేటితో ముగిసింది. దీంతో అధికారులు ఇద్దరిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం భాస్కర్‌రెడ్డికి ఈనెల 29 వరకు, ఉదయ్‌కి ఈనెల 26 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. వైద్య పరీక్షల అనంతరం తిరిగి వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.