ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డిపై సొంత పార్టీ నేతలే గుర్రుగా ఉన్నారా? తన నోటి దురుసుతో లేనిపోని చిక్కులు తెచ్చి పెడుతున్నారని మండిపడుతున్నారా? అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే నిజమే అనక తప్పదు. ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి వరుసగా 2014, 2019లో గెలిచిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి.. 2024లో మాత్రం టీడీపీ సీనియర్ నేత నంద్యాల వరదరాజులుపై 22,744 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మొదటి నుంచి మాటకారిగా పేరున్న శివప్రసాద్ రెడ్డి.. అధికారంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడేవారో.. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా అదే పందాను కొనసాగిస్తున్నారట. తన మీద చిన్న విమర్శ వచ్చినా రాచమల్లు తట్టుకోలేరట. ప్రతీ విషయంలో ఓవర్‌గా రియాక్ట్ అవుతుంటారని.. పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తూ ఎప్పుడూ మీడియాలో ఉండాలని ఆరాట పడుతుంటారని పార్టీలో టాక్ వినిపిస్తోంది.
గతంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో శివప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీలో తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు తేలితే కడప జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేస్తామంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. కడప జిల్లాలో వైఎస్ జగన్ కూడా ఎమ్మెల్యేగా ఉండటం.. వైసీపీ తరపున రాచమల్లే వకాల్తా పుచ్చుకొని మాట్లాడటం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. అయితే.. తీరా వైఎస్ అవినాశ్ రెడ్డి ప్రమేయం ఉందంటూ సీబీఐ అతని పేరును చార్జ్ షీట్‌లో చేర్చడంతో.. రాచమల్లు మాట మార్చారు. తాను నేరం రుజువైతే రాజీనామా చేస్తామని చెప్పానని.. ఇప్పటికైనే ఆయనపై నేరం రుజువు కాలేదు కదా అని రివర్స్ ఎటాక్ చేశారు.
మరోవైపు ప్రొద్దటూరులో రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడ్డారని.. ఇప్పుడు ఓడిన తర్వాత కూడా తీరు మార్చుకోలేదని అంటున్నారు. మున్సిపాలిటీలో జరిగిన అభివృధ్ది పనుల్లో పెద్దఎత్తున అవకతవకలు జరిగినట్లు..జగనన్న కాలనీల కోసం తీసుకున్న భూమి కొనుగోళ్లలో కూడా రాచమల్లు చేతివాటం ప్రదర్శించారని అలిగేషన్స్ వస్తున్నాయట. అయితే ఈ ఆరోపణలపై శివప్రసాద్ రెడ్డి కూడా గట్టిగానే స్పందిస్తున్నారు. రాచమల్లు తనపై వచ్చిన విమర్శలపై ఏ విచారణకైనా సిద్ధమంటూ సవాళ్లు విసురుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై విచారణ చేయాలంటూ..ఆయనే స్వయంగా వైజాగ్ వెళ్లి సీబీఐ ఆఫీస్‌లో ఫిర్యాదు చేసి అప్పట్లో సంచలనం సృష్టించారు.
అధికారంలో ఉన్నప్పుడు ఏ మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది. అయితే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా అదే విధంగా వ్యవహరిస్తే.. చివరకు నష్టపోవాల్సి వస్తుందని శివప్రసాదర్ రెడ్డికి సలహాలు ఇస్తున్నారట. ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది. అనసవరంగా తేనె తుట్టను కదిలించడం ఎందుకని కూడా చెబుతున్నారట. అయితే రాచమల్లు మాత్రం ఇలాంటి సలహాలను పెడచెవిన పెడుతున్నారట. ఏం ధైర్యమో తెలియదు కానీ.. ఏ విచారణకైనా రెడీ అంటూ కూటమి నేతలకు సవాలు విసురుతున్నారు. అయితే.. శివప్రసాద్ రెడ్డి వ్యాఖ్యలను కూటమి ప్రభుత్వం ఏ మాత్రం సీరియస్‌గా తీసుకున్నా.. మొదటికే మోసం వస్తుందనే టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే శివప్రసాద్ రెడ్డి గతంలో చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయట పడటం ఖాయమనే చర్చ జరుగుతోంది.
అయితే.. ఇది ఒక్క రాచమల్లు శివప్రసాద్ రెడ్డితోనే పోదని.. మిగిలిన వైసీపీ మాజీ ఎమ్మెల్యేల వరకు వస్తుందని పార్టీలో ఆందోళన నెలకొంది. రాచమల్లు నోటి దురుసుతో చేసే వ్యాఖ్యలతో తామెక్కడ ఇరుక్కుంటామో అని వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఆందోళన చెందుతున్నారట. రాచమల్లు మీడియాలో ఫోకస్ అవడం కోసం.. తన మాటనే పార్టీ అభిప్రాయంగా చెప్పడం తగదని సూచిస్తున్నారట. శివప్రసాద్ రెడ్డి తీరుపై ఇప్పటికే అధినేత వైఎస్ జగన్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. రాచమల్లు కారణంగా మిగిలిన వైసీపీ నేతలు ఇబ్బందులు పడుతున్నారని.. ఆయన నోటి దురుసు ఎంతటి తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయో అర్థం కాకుండా ఉందని జగన్‌కు విన్నవించుకున్నారట.
మొత్తానికి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన సహజమైన నోటి దురుసుతో పార్టీలోని ఇతర నేతలను ఇబ్బంది పెడుతున్నారు. మరి ఆయన తీరు మార్చుకుంటారా.. లేదంటే ఇతర నేతలను కూడా ఇరికిస్తారా.. అనేది వేచి చూడాలి.