స్వతంత్ర వెబ్ డెస్క్: కాకినాడ నగర ముస్లింలతో జనసేనాని పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, తాను మతాన్ని, ఘర్షణలను అర్థం చేసుకుని వచ్చానని, తాను మిగతా రాజకీయ పార్టీల నేతల్లా కాకుండా ఒక సోదరుడిలా, ఒక మనిషిగా, ఒక భారతీయుడిగా మాట్లాడతానని స్పష్టం చేశారు. ఏ మతంలోనైనా అతివాద భావజాలాన్ని మన అందరం ఖండించాలని పిలుపునిచ్చారు.
విభజన సమయంలో పాకిస్థాన్ నుంచి చాలామంది హిందువులు పారిపోయారని, చాలామందిని చంపేశారని.. కానీ భారతదేశంలో మాత్రం హిందువులు, ముస్లింలు కలిసే ఉన్నారని, అది మనదేశ గొప్పదనం అని వివరించారు. కొంతమంది రాజకీయ నాయకుల వల్లనే సమస్యలు, ఘర్షణలు వస్తాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. నిజంగా మతాన్ని నమ్మేవాళ్లతో ఇబ్బంది లేదని, మతాన్ని రాజకీయం చేసేవాళ్లతోనే ఇబ్బంది అని అన్నారు. “ఈసారి ఎన్నికల్లో ముస్లింలు జనసేనకు మద్దతు ఇవ్వండి.. మీకోసం మరింత పనిచేస్తాను” అంటూ పవన్ కల్యాణ్ ముస్లింలతో సమావేశంలో తన మనోభావాలు వెల్లడించారు.