స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఉత్కంఠ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై పంజాబ్ కింగ్స్ పైచేయి సాధించింది. చివరి బంతికి మూడు పరుగులు కావాల్సి ఉండగా సికిందర్ రాజా భారీ షాట్ కొట్టడంతో 3రన్స్ వచ్చాయి. దీంతో పంజాబ్ విజయం సాధించింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు ఓపెనర్ డేవాన్ కాన్వే 52బంతుల్లో 92 పరుగులతో దంచికొట్టడంతో భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. చివరి ఓవర్లో ఆఖరి రెండు బంతులను ధోనీ సిక్సర్లు కొట్టడం అభిమానులను ఫిదా చేసింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్, సామ్ కరన్ చెరో వికెట్ తీశారు.
ఇక భారీ లక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్ జట్టులో బ్యాటర్లందరూ సమిష్టిగా రాణించారు. ఓపెనర్లు ధావన్(28), ప్రభ్‌సిమ్రన్(42) మంచి శుభారంభం అందించారు. అనంతరం లివింగ్ స్టోన్(40), సామ్ కరాన్(29) పరుగులు చేసి పంజాబ్ జట్టు విజయాన్ని దగ్గర చేశారు. ఇక చివరి ఓవర్లో 9పరుగులు కావాల్సిన తరుణంలో చెన్నై బౌలర్ పతిరాణా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. దీంతో చివర బంతికి మూడు పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో ఉన్న సికిందర్ రాజా సమయస్ఫూర్తిగా ఆడటంతో గెలుపు పంజాబ్ సొంతమైంది.