స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో సాగుతున్న పాదయాత్రలో జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన, యువగళం జెండాలతో పాదయాత్రకు జనసైనికులు సంఘీభావం తెలిపారు. దీంతో టీడీపీ కార్యకర్తలు కేరింతలతో హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగసభలో ప్రసంగించిన లోకేశ్ జనసైనికులకు అభివాదం చేశారు.
ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిపై విమర్శలు చేశారు. తాను ఎస్సీలను అవమానించినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానని.. నిరూపించలేకపోతే భారతీ రెడ్డి తన ఛానెల్, పత్రిక మూసేస్తారా? అంటూ లోకేశ్ సవాల్ విసిరారు. ఆ మీడియా సంస్థ చూపిస్తున్న వీడియోలో జనం చప్పట్లు కొడుతున్నారని.. ఎస్సీల సభలో ఎస్సీలను అవమానిస్తే చప్పట్లు కొడతారా? అని ప్రశ్నించారు. ఇంత చిన్న లాజిక్ భారతీరెడ్డి ఎలా మిస్ అయ్యారని ప్రశ్నించారు.