‘‘అభివందనం యమ రాజ్యాగ్రణి
సుస్వాగతం సుర చూడామణి…
తమ సుగుణాలు పలుమార్లు కీర్తించనీ….’’
యమ సరదాగా సాగిన యమలీలలో పాట, అందులో నవరస నటనా సార్వభౌముడి నటన చూసి తెలుగు అభిమానులందరూ యమహాయిగా ఫీలయ్యారు. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి అద్భుత ఆలోచనకు అభినయనంతో సాకారం చేసి పౌరాణిక పాత్రల ఆహార్యంలో, పాత్ర స్వభావంలో సమయానుకూలంగా చేస్తూ ఎస్వీ రంగారావు తర్వాత తనను మించిన వారు లేరని ప్రేక్షకులను మెప్పించిన ఘనత సత్యనారాయణకే దక్కుతుంది…
ఆ స్ఫూర్తితో ఎస్వీ కృష్ణారెడ్డి ఘటోత్కచుడు సినిమా చేస్తే…అందులో ఒక అద్భుతమైన పాట అది… ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
‘‘అందాల అపరంజి బొమ్మ,
అమ్మ లేదంటు బెంగపడకమ్మా
కడుపార నినుగన్న అమ్మా
చూడలేదమ్మ నీ కంట చెమ్మా’’
అందరి కంటా కన్నీరు పెట్టించిన నవరస నట చక్రవర్తి సత్యనారాయణ నటనను ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇందులో విషాదం పండించిన తీరు నభూతో నభవిష్యత్ అని చెప్పాలి.
ఇక హాస్యం పండించడంలో కూడా తన స్టయిల్ తనదే…అంత పీకలు కోసి, రక్తం తాగే రాక్షసుడిలా నటించిన సత్యనారాయణ ముఖంలో కామెడీని పండించడం అంటే మాటలు కాదు…దానిని అంతే అలవోకగా చేసిన ఘనత ఒక్క సత్యనారాయణకే దక్కుతుంది.
‘వేటగాడు’ సినిమాలో రావుగోపాలరావు కొడుకుగా ఒకే కలర్ డ్రెస్ తో సత్యనారాయణ ఆహార్యం ఒక ఎత్తు అయితే, వారిద్దరి మధ్య డైలాగ్స్ జంధ్యాల అదరహో అన్నట్టు రాశారు.
ఒక సన్నివేశంలో సత్యనారాయన్ని చూసి రావు గోపాల్రావు ఒక డైలాగ్ ఇది…
సత్య: రోజా ఇంతవరకు రాలేదు. పెళ్లయిన ఆడపిల్ల అర్ధరాత్రి వరకు అడవిలో ఆ తిరుగుళ్లేమిటి?
రావు: ‘‘ చిన్నప్పుడు బళ్లు ఎగ్గొట్టి, గుర్రపుబళ్లెక్కి...
జీళ్లు ఇంకా కుళ్లు తిళ్లు తింటూ…
పిచ్చుక గూళ్లు కట్టుకుంటూ...
గుళ్లూ గోపురాలు తిరుగుళ్లు తిరిగి అర్థరాత్రి ఇంటికి చేరే నువ్వు
రోజా తిరుగుళ్లు గురించి మాట్లాడటమా…అసూయాంధకారా..’’
సత్య: ‘‘అబ్బా…నీ ప్రాసతో చస్తున్నాను నాన్నా…గుక్కతిప్పుకోకుండా ఎంతసేపు మాట్లాడతావో మాట్లాడు చూస్తాను’’ అనగానే రావుగోపాలర్రావు యతి ప్రాసల పంచ్ లకి…
‘‘నాన్నోయ్…నాన్నోయ్…ఇంకెప్పుడూ అడగను నాన్నోయ్’’ అంటూ చేసిన హాస్యంతో కూడిన నటనని చూసిన సినీ అభిమానులు ఎవరూ ఆ పాత్రని మరిచిపోలేరు.

ఇక ప్రాణ స్నేహితుడిగా నిప్పులాంటి మనిషి చిత్రంలో ఎన్టీఆర్ తో కలిసి చేసిన చిత్రం అంతకు మించి అని చెప్పాలి. అందులో ‘ స్నేహమేరా జీవితం- స్నేహమేరా శాశ్వతం’ పాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. హిందీలో జంజీర్ పేరుతో వచ్చిన సినిమాలో అమితాబ్- ప్రాణ్ నటించారు. అందులో ప్రాణ్ ని మించిన నటనతో సత్యనారాయణ ఇరగ్గొట్టాడని చెప్పాలి.
సత్యనారాయణలోని మరో కోణాన్ని స్రృశించిన చిత్రం…యమగోల… తెలుగు సినిమా ట్రెండ్ సెట్టర్ అది…సోషియా ఫాంటసీ సినిమాలకు నాంది పలికింది. అందులో యముడిగా సత్యనారాయణ, చిత్రగుప్తుడిగా అల్లు రామలింగయ్య కామెడీ, నటనా చాతుర్యాన్ని ఎవరూ మరిచిపోలేరు. ‘యముండా’ అంటుంటేనే ప్రేక్షకులు అంతెత్తున కుర్చీల్లోంచి లేచి నవ్వేవారు. ఆ డైలాగ్ డెలివరీ సత్యనారాయణ పలికిన తీరు అత్యద్భుతం అని చెప్పాలి.
ఇలా చెప్పుకుంటూ పోతే 700 పైనే సినిమాలు…ఎన్ని పాత్రలు, ఎన్ని రకాల షేడ్స్, కొడుకుగా, అన్నగా, అల్లుడిగా, తండ్రిగా, తాతగా, విలన్ గా, నమ్మక ద్రోహిగా, ప్రాణ స్నేహితుడిగా, తాగుబోతుగా, తిరుగుబోతుగా, పౌరాణిక పాత్రల్లో భీముడు, ధుర్యోధనుడు, యముడు ఇలా ఒకటి కాదు ఎన్నో లెక్క చెప్పలేం. ఇక యముడి పాత్రకు సత్యానారయణ బ్రాండ్ అంబాసిడార్ అని చెప్పాలి.