స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కర్ణాటకలో కాంగ్రెస్ బంపర్ మెజార్టీ సాధించడంతో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత్ జోడో యాత్రతో హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి పప్పు అంటూ విమర్శలు చేసిన వారి నోళ్లు మూయించారని హస్తం నేతలు చెబుతున్నారు. వరుస విజయాలతో భవిష్యత్ భారత ప్రధాని రాహుల్ గాంధీ అవుతారంటూ కితాబిస్తున్నారు.
ఈ క్రమంలోనే తదుపరి ప్రధాని రాహుల్ గాంధీ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా జోస్యం చెబుతున్నారు. అయితే దాన్ని నిర్ణయించేది దేశ ప్రజలేనని తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తమ బాధ్యతను మరింత పెంచిందని పేర్కొన్నారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాలు ప్రధాని మోదీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని చెప్పేందుకు సంకేతమని కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య చెప్పారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ఈ విజయం ఓ మైలురాయి అవుతుందన్నారు. బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి కమలం పార్టీని గద్దె దించుతామని.. రాహుల్ గాంధీనే తదుపరి ప్రధాని అవుతారని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.