ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఏపీకి రానున్నారు రూ.2.08 లక్షల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. రైల్వే జోన్, హైవే ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టబోతున్నారు.
విశాఖపట్నం సమీపంలోని పూడిమడక వద్ద అత్యాధునిక ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టుకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. హరిత ఇంధనం, సుస్థిర భవిష్యత్తు దిశగా అంకితభావంతో ఆయన వేసిన మరో ముందడుగిది. జాతీయ గ్రీన్ హడ్రోజన్ మిషన్ లో భాగంగా ఇదే తొలి గ్రీన్ హైడ్రోజన్ హబ్. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 1.85 లక్షల కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. 2030 నాటికి శిలాజేతర ఇంధన సామర్థ్యం 500 గిగావాట్ల లక్ష్యాన్ని సాధించడానికి గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. తద్వారా, రోజుకు 1500 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యంతో ఇది దేశంలోని అతిపెద్ద సమీకృత గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాల్లో ఒకటిగా మారనుంది. దానితోపాటు హరిత మిథనాల్, హరిత యూరియా, పర్యావరణ హిత వైమానిక ఇంధనం సహా రోజుకు 7500 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తులను అందించగల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టు ప్రధానంగా ఎగుమతి మార్కెట్ ను లక్ష్యంగా పని చేస్తుంది.
అలాగే ఏపీలో చేపడుతున్న 19 వేల 500 కోట్ల విలువైన రైల్వే, రోడ్డు ప్రాజెక్టులకు సంబంధించి కొన్ని పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనుండగా మరికొన్నింటిని ప్రారంభిస్తారు. విశాఖ దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి సైతం ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే మరికొన్ని ఇతర ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. మరోవైపు అనకాపల్లి జిల్లా నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్, తిరుపతి జిల్లాలో చెన్నై- బెంగళూరు పారిశ్రామిక కారిడార్ పరిధిలోని కృష్ణపట్నం క్రిస్ సిటీకి ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. నేషనల్ ఇండస్ర్టియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద క్రిస్ సిటీని గ్రీన్ ఫీల్డ్ ఇండస్ర్టియల్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 10 వేల 500 కోట్ల పెట్టుబడులను ఆకర్షించనున్నారు.
ప్రధాని మోదీ సాయంత్రం విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ మోదీకి ఘనస్వాగతం పలకనున్నారు. అనంతరం మోదీతో కలిసి చంద్రబాబు, పవన్ కల్యాణ్ రోడ్ షోలో పాల్గొననున్నారు. విశాఖలో రోడ్డు మార్గంలో సిరిపురం కూడలి నుంచి ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ వరకు రోడ్ షో జరగనుంది. ఈ ముగ్గురు కలిసి నిర్వహించే రోడ్ షో ప్రధాని పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రోడ్ షో అనంతరం ప్రధాని మోదీ బహిరంగ సభ జరగనుంది. ఈ క్రమంలో వివిధ ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
ఇక మోదీ పర్యటనతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది కూటమి సర్కార్. టూర్ ఏర్పాట్లను మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ సహా పలువురు పరిశీలించారు. కార్యక్రమానికి సుమారు 3 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, ఉమ్మడి విశాఖ జిల్లాల నుంచి ప్రజలను తరలించేందుకు సుమారు 7000 వాహనాల కేటాయించారు. అలాగే ప్రధాని రాక నేపథ్యంలో ఉమ్మడి విశాఖలో పలు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం తగిన చర్యలు చేపట్టారు.