- దేవాలయాలు, విద్యాలయాలను సందర్శించిన రాష్ట్రపతి
ప్రస్తుతం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పర్యటిస్తున్నారు. మొదటగా ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ద్రౌపది ముర్ముకి తెలంగాణ ప్రభుత్వ పెద్దలు స్వాగతం పలికారు. అక్కడ నుంచి శ్రీ శైలం వెళ్లి అక్కడ దేవాలయంలో పూజలు జరిపించుకున్నారు. తర్వాత హైదరాబాద్ చేరుకొని బస చేశారు. హైదరాబాద్ లోని కేశవ్ మెమోరియల్ విద్యా సంస్థల్ని సందర్శించి, విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. అలాగే, భద్రాచలం రాముడిని దర్శించుకోవటంతో పాటుగా సమ్మక్క సారలమ్మ ఆలయానికి ప్రత్యేకంగా వెళ్లారు. అక్కడ జరుగుతున్న గిరిజన పూజారుల సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఇక్కడ రాష్ట్రపతి పర్యటన గురించి కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా కాలం కిందటే సువిశాల భారతదేశంలో ప్రాంతాల మధ్య కొంత అంతరం తలెత్తింది. రాజధానిలోనే దేశ నాయకత్వం కేంద్రీకృతం అవటంపై చర్చ జరిగింది. ఈ అంశాన్ని అధిగమించటానికి ఒక సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. దక్షిణాదిన హైదరాబాద్‌లో.. ఉత్తరాదిన సిమ్లాలో రాష్ట్రపతి భవన్లు నిర్మించారు. ప్రతీఏటా రాష్ట్రపతి ఈ నగరాల్ని సందర్శించాలని నియమం పెట్టారు. అందులో భాగంగానే రాష్ట్రపతిగా ఎవరు ఉన్నప్పటికీ, క్రమం తప్పకుండా దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించాల్సి ఉంటుంది. ఆ సమయంలో హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయాల్సి ఉంటుంది. దీని కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రజానీకానికి రాష్ట్రపతి చేరువలోకి వచ్చినట్లవుతుంది. చాలా సందర్భాల్లో ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అనేక ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు రాష్ట్రపతిని కలిసి విజ్ఞాపన పత్రాలు అందిస్తూ ఉంటాయి. మొత్తంగా ఫెడరల్ స్ఫూర్తికి అనుగుణంగా రాష్ట్రపతి పర్యటన దక్షిణాది రాష్ట్రాల్లో జరుగుతోంది అని అనుకోవచ్చు.
ఈ కోణంలోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. ప్రతీ రోజూ సాయంత్రం హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేస్తున్నారు. రాష్ట్రపతి పర్యటన కోసం ముందుగానే పెద్దస్థాయిలో ఏర్పాట్లు జరుగుతుంటాయి. అందుచేత రాష్ట్రపతి పర్యటన పూర్తయ్యాక.. కొన్ని రోజుల పాటు సాధారణ ప్రజానీకాన్ని రాష్ట్రపతి నిలయం సందర్శించేందుకు అనుమతిస్తుంటారు.