అతి సర్వత్ర వర్జయేత్…ఇది సుభాషిత సూక్తి. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు, విధి విధానమున తప్పించుటకు ఎవరు సాహసించెదరు.. ఇది పౌరాణిక సినీ గేయం. ఆలస్యం అమృతం విషం..ఇది సూక్తి. ముందు వెనుకలు ఆలోచించకుండా ఏ పని చేయరాదు…ఇది పెద్దలు చెప్పిన మాట. ఇవన్నీ తరచు అందరికీ వర్తించేవే. అయితే, ధర్మం ఒంటి పాదం మీద నడుస్తున్న కలియుగం.. కలుషాల మయంగా మారడంతో… న్యాయం మీద అన్యాయం, ధర్మం మీద అధర్మం విజయం సాధించేస్తున్నాయి. యావత్ సమాజం పాపపంకిలం అయిపోతుంటే.. పవిత్ర పర్వదినాలు, పుణ్యనదీ స్నానాలు, పన్నెండేళ్ల పుష్కరాలు, కుంభమేళాలు..జనాల పాలిట వరాల్లో ఉంటున్నాయి. ఈ పర్వదినాలు, పుణ్యస్నానాల గురించి ఆయా వైభవ సమయాల్లో ఆధ్యాత్మికవేత్తలు, ధార్మిక గురువులు ప్రవచనాలు, ప్రబోధాలు.. భక్తజనులపై విపరీతంగా పనిచేస్తాయి. ఏ విషయాన్నయినా, ఏ పండువ, సంబరం, మేళాల గురించైనా తమ జ్ఞాన పాండిత్యంతో ఏ రీతినైనా చెప్పగల సత్తా ఈ ప్రవచన కర్తలకు ఉంటుంది. ఈ గురువుల వాక్కు వేదవాక్కుగా భావించే శిష్య, ప్రశిష్య, భక్తగణం.. నిప్పుల్లో దూకమంటే దూకేస్తారు. నీళ్లల్లో మునగమంటే మునిగేస్తారు. గతంలో ఓ పుష్కరాల్లో పిప్పిలాదుడనే రాక్షసుడి ఘట్టం చెబుతూ ఓ ధార్మిక గురువు.. నది గట్టున ఉన్న మట్టిని మూడు గుప్పిళ్లు నదిలో వేసి పుష్కర స్నానం చేయాలి అని చెప్పడంతో…భక్తులు మొత్తం గట్టే లేకుండా చేసిన సందర్భం, ప్రమాదం జరిగిన విషయం మనకు విదితమే.
ఇప్పుడు ప్రయాగ రాజ్ మహాకుంభమేళాలో ఎందరో భక్తుల తొక్కిసలాటకు గురై ప్రాణాలు కోల్పోయారు. పాలకులు, అధికారుల హెచ్చరికల కంటే.. అమితంగా ధార్మిక గురువుల మాటలనే ప్రజలు, భక్తులు విశ్వసిస్తారు. అయితే, ఇప్పుడు ధార్మిక గురువులు గట్టిగా బోధనలు చేయకపోవడంతో ముప్పు వచ్చిందేమో అనే వ్యాఖ్యానాలు వినబడుతున్నాయి… ఏ ఘాట్ లలో కుంభమేళా స్నానం చేసినా.. పుణ్యఫలం దక్కుతుందని..ప్రత్యేకంగా ఎవరికో కేటాయించిన ఘాట్ లలోకి వెళ్లడం వల్ల పుణ్యం రాదని.. బోధనలు చేసి ఉంటే ఈ అనర్థం కలగకపోవునేమో అని మరికొన్ని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. తమదైన శైలిలో ఏ గురువు ఏ ఉత్తమ బోధన చేసినా ఉత్తమమే. తమ మేధో పాండిత్య సంపదతో తమకు తోచిన విధంగా బోధనలు చేసేస్తే అనర్థాలు తలెత్తుతాయి. పర్వదినాల్లో దేవాలయాల్లో, కుంభమేళా, పుష్కరాల్లో నదీస్నానాల సమయంలో పెద్ద ఎత్తున భక్తజన వరద ప్రవహించడం సహజమే. ఈ సమయంలో సద్గురువులు సద్బోధనలతో…భక్తులు క్రమశిక్షణతో మెలిగి, చక్కగా తమ పుణ్యస్నానాలు, పవిత్ర దర్శనాలు చేసుకుని తిరిగి వెళ్లేలా బోధనలు ఉంటే ఎంతో ప్రయోజనకరంగా ఉండేవని. ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో భక్తుల స్నానాలు, స్నాన ఘట్టాలకు సంబంధించిన మాటలు అధికారులు, పాలకులు చెప్పారు తప్ప గురువుల బోధన ఉన్నట్టు ఎక్కడా కనిపించలేదని అంటున్నారు. అయితే, ఇక్కడ గురువులు చెప్పే బోధనలు.. ఆలస్యం అమృతం విషం అనే మాదిరి కాకుండా ముందు వెనుకలు ఆలోచించకుండా ఏ పని చేయరాదనే రీతిలో బోధనలు సాగివుంటే బాగుండేదని, ఎన్నో ప్రాణాలు నిలబడేవేమో అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
అలహాబాద్ ప్రయాగ్ రాజ్ ….అతి గొప్ప పుణ్యప్రదేశం. స్పష్టమైన నీటితో గంగ, హరితశోభితంగా యమున, అంతర్వాహినిగా సరస్వతి… ఈ మూడు పవిత్ర నదులు సంగమం అయ్యే పవిత్ర ప్రాంతం ఇది. త్రి అంటే మూడు వేణి అంటే నది.. మూడు నదుల సంగమ ప్రాంతంలో పన్నెండేళ్లకోసారి వచ్చే పవిత్ర కుంభమేళ వచ్చిందంటే భక్తజనవాహిని తరలిరాకుండా ఉంటుందా..? ప్రభుత్వ పాలకులు, అధికారులు.. పుణ్యస్నానాలకు వచ్చే భక్తులకు ఏ ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. తిరుమల విషాద ఘటన, ఇంతకు ముందు పుష్కరాల్లో, పుణ్య నదీ స్నానాల సమయంలో తలెత్తిన అవాంఛనీయ ఘటనలు దృష్టిలో పెట్టుకుని..ఎంతో జాగ్రత్త వహించి, ఎన్నో ముందస్తు భద్రతా చర్యలు తీసుకుని, పెద్ద ఎత్తున ఘాట్ లు ఏర్పాటు చేసి.. విశేషంగా శ్రమించినా అనర్థం జరిగిపోయింది. తొక్కిసలాటలు, మంటల చెలరేగడాలు…ఈ దుర్ఘటనల్లో ప్రాణాలు కోల్పోవడాలు జరిగినట్టు వార్తల ద్వారా తెలిశాయి. అందుకే.. మనం పైన చెప్పిన మాటల్లో.. . ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు, విధి విధానమున తప్పించుకటకు ఎవరు సాహసించెదరు…అని మౌనం వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
జనవరి 13 భోగి పర్వదినాన ప్రారంభమైన 45 రోజుల ప్రయాగ్ రాజ్ కుంభమేళా ఫిబ్రవరి 26 వ తేదీన ముగుస్తుంది. పుష్య పూర్ణిమ నాడు జనవరి 13న తొలి పుణ్యస్నానం జరుగగా, జనవరి 14న మకర సంక్రాంతి రోజున సంక్రమణ పర్వదిన పుణ్యస్నానాలను భక్తులు ఆచరించారు. జనవరి 29న మౌని అమావాస్య నాడు పుణ్యస్నానాలు పూర్తయ్యాయి, అయితే, కొందరు భక్తులు తొక్కిసలాటలో 30 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయి శివైక్యం చెందారు. ఫిబ్రవరి 3న వసంతపంచమి శుభఘడియల్లో భక్తులు పుణ్యస్నానాలు చేయనున్నారు. అదేవిధంగా ఫిబ్రవరి 12న మాఘ పౌర్ణమి నాడు పుణ్యస్నానాలు చేయనున్నారు. దైవ మహిమ కాకపోతే… మహ కుంభమేళా ముగిసే రోజు మహా శివరాత్రి కావడం ఎంత విశేషం అని భక్తులు పారవశ్యం చెందుతున్నారు. ప్రపంచం నలు మూలల నుంచి వచ్చిన కోట్లాది మంది మహా కుంభమేళా పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన కుంభమేళా పుణ్యస్నానాల్లో ఎన్నో విశేషాలు చోటుచేసుకున్నాయి. ఇవింకా సశేషంగా ఉన్నాయి. ఇంకెన్ని ఘటనలు జరుగుతాయో చూడాల్సి ఉంది…పుష్య పౌర్ణమి నాడు మొదలైన మహా కుంభమేళా పుణ్యస్నానాలు మహాశివరాత్రితో పూర్తవుతుండగా… ఈ మధ్యలో ఎన్నో ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. భక్తిపూర్వంగా కోలాహలంగా భక్తులు చేస్తున్న పుణ్యస్నానాల సమయంలో ఇప్పటికే ఎన్నో ఉదాత్త ఘట్టాలు, విషాద ఘటనలు దర్శనమిచ్చాయి. ఎన్నో ఆశ్చరం గొలిపే విషయాలు జరిగాయి.
ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేయగలదు. ఇది పాతమాట అయిపోయింది. ఒక్క క్షణం…గగనం అంత ఎత్తు ఎదిగేలా చేయగలదు.. కుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్ గా ఓ పూసలమ్మాయి నిలిచింది. అందంలో అప్సరసలా ఉన్న ఆ అమ్మాయి పేరు ఓ అందాల బొమ్మపేరు. ఆ అందాల బొమ్మను రూపొందించింది ప్రపంచ ప్రసిద్ద చిత్రకారుడు లియోనిధ్ డా విన్సీ. అసలు.. ఆ చిత్రకారుడు ఆ బొమ్మకు పెట్టిన పేరునే తన కుమార్తెకు పెట్టానని అప్సరస అమ్మాయి తండ్రి తెలిపారు. ఆ అందాల బొమ్మ పేరు, ఈ ముద్దుల గుమ్మ పేరు ఒకటే.. అదే మోనాలిసా. అందం అమ్మాయైతే నీలా ఉందే అన్నట్లుందే .. లిరిక్స్ ఈమెకు సరిగ్గా సరిపోయేలా ఉన్నాయి. చంద్రబింబంలాంటి ముఖారవిందంతో ఉన్న ఈ గ్రామీణ అందాల పడతికి మేకప్ లు, లిప్ స్టిక్ లు గురించి ఏమీ తెలియదు. దుమ్ము, ధూళీ, ఎండా, వాన, రోడ్డు, పల్లె, ఇల్లు తప్పించి ఏ గొప్పలు తెలియవు.
దేవుడు చేసిన అందాల దేవతలా మోనాలిసా… మహాకుంభమేళాకు ఆధ్యాత్మిక కేంద్రంగా మారిన ప్రయాగ్ రాజ్ కు వచ్చి రుద్రాక్షలు, పూసలు దండలు అమ్ముతుండగా.. విశ్వ దృష్టికి వచ్చింది. ఆమె అసలు సిసలు నిఖార్సయిన రియల్ బ్యూటీని చూసి కోటాను కోట్ల మంది ప్రజలు…దివి నుంచి భువికి వచ్చిన దేవకన్య మాదిరి తిలకించారు. సోషల్ మీడియా దెబ్బతో సెలబ్రిటీ అయిన ఆమెకు బ్రౌన్ బ్యూటీని బాలీవుడ్ హీరోయిన్ కావాలని యూత్ సోషల్ మీడియా పోస్టులు పెట్టారు. ఆమెకు సినిమా చాన్స్ లు వచ్చాయనే ప్రచారాలు జరిగాయి. లియోనార్డ్ డా విన్సీ సృష్టించిన మోనాలిసా చిత్రం కంటే ఈ మోనాలిసా పేరే ఒక్క రోజులో రికార్డులు సృష్టించిందని వ్యాఖ్యానించారు.
ఇండోర్ కు చెందిన 16 ఏళ్ల అమ్మాయి మోనాలిసా భోంస్లే విషయం సోషల్ మీడియాకు ఎక్కడంతో రాత్రికి రాత్రే ఆమెకు సెలబ్రెటీ స్టేటస్ తెచ్చిపెట్టేసింది. వైరల్ అయిన వీడియో ఆమెకు ఎక్కడలేని ఖ్యాతి తెచ్చిపెట్టింది. అయితే, ఇది ఆమె ఉనికికి సవాలుగా మారింది. కుంభమేళాలో నేరుగా, సోషల్ మీడియాలో పరోక్షంగా ఆమెను తిలకించడానికి పెద్ద ఎత్తున జనాలు ఆసక్తి చూపారు. దీంతో, ఆమె కుటుంబ సభ్యులు, రక్షకభట సిబ్బంది ఆమెకు భద్రత, రక్షణ కల్పించడానికి నానా కష్టాలు పడాల్సి వచ్చింది. ఆమె ప్రైవసీకి ఆటంకం కలిగేస్థాయికి పరిస్థితి రావడంతో…ఆమె కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను రహస్యంగా ఇండోర్ కు తీసుకెళ్లినట్టు సమాచారం వెలువడింది.
మోనాలిసా భోంస్లే ప్రస్తుత వార్త చూస్తుంటే ఇదివరలో వచ్చిన ఓ పాత సినిమాలో పేదింటి పల్లెటూరు అమ్మాయి కథ గుర్తుకు వస్తుంది. కొంత సామీప్యం కనిపిస్తోంది. పల్లెటూరి పడతి, తన ప్రియసఖుడు, తన కుటుంబీకులు ఓ సినిమా హాలులో పనిచేస్తూ..హాయిగా ఆనందంగా జీవనం సాగిస్తూంటారు. ఆమె అద్భుత సౌందర్యాన్ని చూసిన ఓ నిర్మాత.. సినిమాలో నటించడానికి ఆమెను, ఆమె కుటుంబ సభ్యులు ఒప్పిస్తాడు. ఆమె పెద్ద హీరోయిన్ గా మారి కోటాను కోట్ల రూపాయలు సంపాదించడం, అయినవారికి దూరం అయ్యి, అన్ని ఉన్నా ఏ సంతోషానికి నోచుకోకపోవడం, చివరకు తాను అదృశ్యమైనట్టు అందరిని నమ్మించి, చివరకు సినిమాహాలులో పనిమనిషిగా పాత జీవనం గడపడం మనం చూశాం. ఇప్పుడు ఈ అమ్మాయిని ఎంత గొప్పదాన్ని చేస్తామని ఎందరో ముందుకొచ్చినా.. తమ ప్రశాంత జీవితమే మేలని భావించారో ఏమో.. అందుకే, ఆమె కుటుంబ సభ్యులు ఆమెను ఎవరికి కనిపించకుండా తీసుకెళ్లిపోయారు.
ఉన్నవాడికి తింటే అరగదు, లేని వానికి తిండే దొరకదు, పరుపులున్నా పట్టదు నిద్దుర, గరకు నేలన గురకలు వినరా.. అని సినీ కవి అన్న గేయవాక్కులను గమనిస్తే… అమిత ఐశ్వర్యం, అమిత పేరు ఇబ్బందికరమే అని అనిపిస్తుంది. అయితే, పద్దతిగా, సమయపాలనతో, మంచి మార్గంలో ముందుకెళుతూ…ఎందరికో సాయపడుతూ, తాము సుఖంగా ఉంటూ…ఎనలేని కీర్తి ప్రతిష్టలు గడించిన ఎందరో ధనవంతులు, వితరణశీలురు మనకు కనిపిస్తూంటారు.. మోనాలిసాకు అవకాశాలు వస్తే.. ఈ రీతిలో ముందుకెళ్లి…వైభవోపేత జీవితం గడపాలని పలువురు సలహా ఇస్తున్నారు.