ప్రశాంత్ కిషోర్.. ఎన్నికల వ్యూహకర్తగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఆయన.. మరోసారి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు. టీడీపీ అధినేత చంద్రబాబును కలిసేందుకు నారా లోకేష్‌తో కలిసి వెళ్తూ గన్నవరం విమానాశ్రయంలో కన్పించారు పీకే. వీరిద్దరితోపాటు టీడీపీ విజయానికి కృషి చేస్తున్న షో టైమ్ కన్సల్టెన్సీ సంస్థకు చెందిన ఆపరేషన్ హెడ్ శంతను, నారా లోకేష్ సన్నిహితుడిగా గుర్తింపు పొందిన కిలారు రాజేష్ అంతా కలిసి ఒకే విమానంలో విజయవాడ వచ్చారు. అట్నుంచటే అంతా కలిసి మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశానికి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మోడీ సర్కారు 2014లో కేంద్రంలో అధికారంలోకి రావడం, అందులో పీకే వ్యూహాలు ఉండడంతో…అప్పట్నుంచి ప్రశాంత్ కిషోర్ పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాత బీహార్ ఎన్నికల్లోనూ ప్రశాంత్ వ్యూహం పనిచేసింది. అంతే అప్పట్నుంచి ఓ వెలుగు వెలిగారు పీకే. ఐ ప్యాక్ సంస్థ పేరుతో సర్వేలు చేస్తూ ఆయా పార్టీల విజయంలో కీలక పాత్ర పోషించారు ప్రశాంత్ కిషోర్. అందులో భాగంగానే 2019 ఎన్నికల్లో వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించారు. అలాంటి పీకే.. బెంగాల్‌లో దీదీ ప్రభుత్వానికి సాయమందించారు. గెలుపు తీరాలకు చేర్చారు. ఆ తర్వాత ఈ సర్వేల నుంచి వెదొలగుతానంటూ ప్రకటించి సంచలనం సృష్టించారు పీకే. ఈ క్రమంలోనే ఐప్యాక్ సహ వ్యవస్థాపకుడు రిషి రాజ్‌తోనూ ఆయనకు మనస్పర్థలు వచ్చినట్లుగా జోరుగా ప్రచారం సాగింది.
అప్పట్నుంచి తన సొంత పనిలో నిమగ్నమైన పీకే… ఇప్పుడు తన మాటలను పక్కన పెట్టేసి రూటు మార్చినట్లే కన్పిస్తోంది. పరిస్థితి చూస్తుంటే ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుపు బాధ్యతలను పీకే భుజస్కంధాలపై చంద్రబాబు నాయుడు పూర్తిస్థాయిలో పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం 120 కోట్ల మేర డీల్ కుదిరినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది.
2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్‌పై నాటి సీఎం చంద్రబాబు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. బహిరంగ సభల సాక్షిగా ఆయనపై ఎన్నో ఆరోపణలూ గుప్పించారు.
ఏపీలో పొలిటికల్ హీట్ విపరీతంగా ఉన్న నేపథ్యంలో టీడీపీ..పీకే సాయాన్ని తీసుకోవడంపై వైసీపీ ఎలా స్పందించే అవకాశం ఉంది. ప్రత్యేకించి సీఎం జగన్ ఎలాంటి కామెంట్లు చేస్తారన్నది ఆసక్తి,, అంతకు మించిన ఉత్కంఠ రేపుతోంది.