తెలంగాణ ఎన్నికల్లో పవర్ ఫైట్ జరుగుతోంది. ప్రచార పర్వం మొదలైనప్పటి నుంచి రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అగ్రనేతలు ఎక్కడ ప్రచారం నిర్వహించినా కరెంటు గురించి ప్రస్తావన రాకుండా ఉండడం లేదు. మొత్తం ఎన్నికల్లోనే కీలక అస్త్రంగా మారిన ఈ కరెంటు సమస్య ఎవరికి లాభం చేకూర్చనుంది..? ఎవరికి నష్టం చేయబోతోంది ?
పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణ ఎన్నికల్లో ప్రచార పర్వం మరింత ఊపందుకుంటోంది. ఈ కోవలోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. ఇతర సమస్యల గురించి ఇరు పార్టీలు ఎలా స్పందించినా, విమర్శలు గుప్పించుకున్నా విద్యుత్ విషయం వచ్చే సరికి మాత్రం మరింతగా ఫైరవుతున్నారు ఇరు పార్టీల నేతలు. ప్రచార పర్వం మొదలైనప్పటి నుంచి తెలంగాణలో విద్యుత్‌పై బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. తమ హయాంలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందుతోందని చెబుతున్నారు గులాబీ పార్టీ అధినేత కేసీఆర్. ఈ విషయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఆయన ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.
వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ సరిపోతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ అన్నారంటూ ఆరోపిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. స్వయంగా సీఎం కేసీఆర్ సైతం ప్రతి సభలోనూ రేవంత్ వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తున్నారు. రైతుల సమస్యలు తాను స్వయంగా చూశానని, తానూ ఓ రైతునేనని చెబుతున్న ఆయన.. మూడు గంటల విద్యుత్ అన్నదాతలకు ఏ మాత్రం సరిపోదని ఈ విషయంలో కాంగ్రెస్‌ను నిలదీయాలని సూచిస్తున్నారు. తద్వారా హస్తం పార్టీని దోషిగా నిలిపే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్.
అయితే..తాను ఎక్కడా వ్యవసాయానికి మూడు గంటలు మాత్రమే విద్యుత్ చాలని అనలేదంటున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ చెబుతున్నట్లుగా 24 గంటల విద్యుత్ అసలు రాష్ట్రంలో ఎక్కడ ఇస్తున్నారని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో తాను ఎలాంటి చర్చకైనా సిద్ధమంటూ తన ప్రచార సభల్లో బహిరంగ సవాల్ విసురుతున్నారు రేవంత్ రెడ్డి. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టంలోనూ ఇదే వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. ఉచిత విద్యుత్ 24 గంటల పాటు రాష్ట్రంలో ఇస్తున్నట్లుగా చూపించే లాగ్ బుక్‌లు తీసుకొస్తే తాను కామారెడ్డి, కొడంగల్‌లో నామినేషన్‌లు ఉపసంహరించుకుంటానని ఏకంగా బీఆర్ఎస్ బాస్‌కే సవాలు విసిరారు రేవంత్ రెడ్డి.
ప్రచారం హోరుగా సాగుతున్న వేళ అత్యంత కీలకమైన విద్యుత్‌పై ఇరు పార్టీల మధ్య పేలుతున్న మాటల తూటాల గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. మరి..ప్రజలు ఏ పార్టీ ప్రచారాన్ని నమ్ముతారు..ఈ విద్యుత్ అంశం ఎవరి పుట్టి ముంచుతుందోనన్న టెన్షన్ అందరిలోనూ నెలకొంది.