స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఖమ్మంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కలెక్టరేట్ ముట్టడికి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భారీగా తన అనుచరులతో కలిసి వచ్చారు. దీంతో పొంగులేటిని అడ్డుకున్న పోలీసులు కలెక్టరేట్ గేట్లను మూసేశారు. అయితే ఆయన అనుచరులు గేట్లు తోసుకుని కలెక్టరేట్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో తోపులాట చోటుచేసుకుంది.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పొంగులేటి సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఇక్కడి రైతులను ఆదుకోలేని కేసీఆర్ దేశాన్ని ఉద్ధరిస్తానని చెప్పడం హాస్యాస్పదమన్నారు. అమ్మకు బువ్వ పెట్టలేనివాడు పినతల్లికి బంగారు గాజులు కొనిస్తానని చెపితే నమ్మడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని మండిపడ్డారు. పంట నష్టపోయిన రైతులకు వెంటనే ఎకరానికి రూ. 30వేల చొప్పున పరిహారం ఇవ్వాలని పొంగులేటి డిమాండ్ చేశారు.