స్వతంత్ర వెబ్ డెస్క్: బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరున ఖమ్మంలో కాంగ్రెస్ భారీ సభ నిర్వహిస్తుండగా, ఈ సభలో పొంగులేటి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం. ఇక నాగర్ కర్నూలు సభలో జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరతారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ నెల 22న పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలవనున్న నేపథ్యంలో, వీరు కాంగ్రెస్ లోకి వెళుతున్నారన్న కథనాలకు బలం చేకూరుస్తోంది. వీరిద్దరితో పాటు కె.దామోదర్ రెడ్డి కూడా రాహుల్ ను కలవనున్నట్టు తెలుస్తోంది. దాంతో, దామోదర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారన్నదానిపై స్పష్టత వచ్చింది.


