వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఉన్నతస్థాయి దర్యాప్తు జరుగుతోంది. అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. నిన్న పరిగి పోలీస్ స్టేషన్‌లో ఆరు గంటల పాటు కేసుకు సంబంధించి విచారించారు.ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ చాటింగ్ విశ్లేషణపై ఫోకస్ చేశారు. లగచర్ల ఘటనలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రమేయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసులో పట్నం నరేందర్ రెడ్డితో సురేష్ 84 సార్లు ఫోన్‌లో మాట్లాడినట్టు పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. దాడి ఘటన తర్వాత అజ్ఞాతంలో ఉన్న సురేశ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సురేశ్‌కు భూములు లేవని పోలీసులు చెబుతున్నారు. ఉద్దేశపూర్వకంగానే కలెక్టర్, అధికారులపై దాడులకు పాల్పడ్డారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.