అధికారం అండతో గన్నుపెట్టి ఆస్తులు రాయించుకోవడం ఎక్కడా లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ భవన్‌లో ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. వ్యాపారాల్లో వాటాలు తీసుకున్న ఘటనలు దేశ చరిత్రలోనే లేవన్నారు. కొత్త తరహా నేరాల పట్ల చర్యలేంటో ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తోందని పేర్కొన్నారు. అవినీతి గురించి విన్నాం కానీ.. వ్యాపారాల్లో వాటాలు లాక్కోవడం ఇప్పుడే చూస్తున్నామన్నారు. తుపాకీ చూపించి మరీ ఆస్తుల్లో వాటాలు లాక్కోవడం మునుపెన్నడూ లేదన్నారు. ముంబయిలో మాఫియా బృందాలు లాక్కునే ఆస్తులను సీజ్ చేసే చట్టం ఉందని.. ఆ అంశంపై సమాచారం తెప్పించుకుంటామని చెప్పారు. ఆస్తులను పోగొట్టుకున్న వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు.
అమరావతిలో ఇంటి నిర్మాణం కోసం స్థలం కొనుగోలు చేశానని సీఎం చంద్రబాబు తెలిపారు. త్వరలోనే శంకుస్థాపన చేస్తామని చెప్పారు. ఇంటి నిర్మాణం వ్యవహారమంతా కుటుంబసభ్యులు చూసుకుంటారని అన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన భూ అక్రమాలపై సమగ్ర విచారణ జరుగుతోందని చెప్పారాయన. కాకినాడ పోర్టు విషయంలో..జగన్ పనితీరు ఎలా ఉందో ప్రజలకు అర్థమైందన్నారు చంద్రబాబు.