పాలనాకాంక్ష, అధికార వ్యామోహంతో ఎన్నికలు వచ్చాయంటే చాలు.. పార్టీలు ఉచితాలు ప్రకటించడం షరా మామూలైపోయింది. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేదు. అన్ని పార్టీలు ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు ఫ్రీ ఫ్రీ ఫ్రీ అంటూ మేనిఫెస్టోలో ఊదరగొడుతున్నాయి. వృద్ధులకు పెన్షన్, గర్భిణీలకు డబ్బులు, మహిళలకు డబ్బులు, ఆటో డ్రైవర్లకు, విద్యార్థులకు, వితంతు మహిళలకు, చిన్న వ్యాపారులకు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితాలో కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉండే కేటగిరే లేదు. ఇలా ఉచితాలు ప్రకటించి.. ప్రజలను సోమరిపోతుల్లా తయారు చేయడమే వారి ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తుంది. ఎవరు ఎలా పోతే మా కేంటి.. మాకు కావాల్సిందల్లా.. ఐదేళ్ల పాలన అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఇక ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి రాష్ట్రాలను అప్పుల పాలు చేస్తున్నాయి. అందుకే సుప్రీంకోర్టు ఉచితాలు మంచివికావని రాజకీయ పార్టీలకు తలంటు పోసింది.
పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఉచితాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత పథకాలు దేశానికి మంచివి కావని.. ఇలా ఉచితాలు ప్రకటించడం వల్ల ప్రజలు కష్టపడి పని చేసేందుకు ఇష్టపడడం లేదని చెప్పింది. ఉచితంగా రేషన్, డబ్బులు అందుతున్నాయి… ఎలాంటి పని చేయకుండానే డబ్బులు వస్తుండటంతోనే ఎవరూ పని చేయడానికి ఇష్ట పడటం లేదని తెలిపింది. ప్రజలకు సౌకర్యాలు అందించాలన్న ప్రభుత్వాల ఉద్దేశం మంచిదే అయినా.. వారిని దేశ అభివృద్ధిలో భాగం చేయాలి.. కానీ ఉచితాల ద్వారా అలా జరుగుతోందా..? అని ప్రశ్నించింది. ఎన్నికల్లో ఉచిత పథకాలు ప్రకటించే పద్ధతి సరైనది కాదని జస్టిస్ బీఆర్.గవై, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్‌తో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.