ప్రకృతిలో దేవుణ్ణి చూసుకోవడం, పచ్చదనంలో భగవంతుడిని ఆరాధించడం భారతీయ సంప్రదాయం అని..ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. వినాయక చవితి, స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా పర్యావరణహిత కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్లాన్ ఏ ప్లాంట్ సంస్థ ప్రతినిధులు పవన్ కళ్యాణ్‌ను కలిశారు.
అనంతరం వారు పవన్‌కు ప్రత్యేకంగా విత్తనాలతో రూపొందించిన మట్టి గణపతి, జాతీయ జెండాలను అందచేశారు. దైవభక్తి, దేశభక్తిని మిళితం చేస్తూ పర్యావరణహితంగా ప్లాన్ ఏ ప్లాంట్ సంస్థ చేసిన ఆలోచన చాలా బాగుందని కొనియాడారు. ఈ ఆలోచన సమాజహితంగా ఉందని చెప్పారు. పర్యావరణానికి ఉపయోగపడే ఇలాంటి ఉత్పత్తులను ప్రోత్సహించాలన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్లాస్టిక్ జెండాలు వాడవద్దని సూచించారు. పర్యావరణహితమైన జెండాలు మాత్రమే వినియోగించాలని డిప్యూటీ సీఎం చెప్పారు.


