సూర్యాపేట జిల్లా గుడిబండ గ్రామసభ రసాభాసగా ముగిసింది. తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి నాలుగు రోజుల పాటు గ్రామసభలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు దరఖాస్తులు తీసుకునేందుకు గ్రామసభలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే కోదాడ మండలం గుడిబండ గ్రామసభకు వచ్చిన తహసీల్దార్‌ను గ్రామస్థులు నిలదీశారు. ఇందిరమ్మ ఇళ్లు భూస్వాములకు ఇచ్చారని మండిపడ్డారు.
రిటైర్డ్ ఉద్యోగులకు సైతం ఇళ్లు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త రేషన్ కార్డుల జారీలో భారీగా అవకతవకతలు జరిగాయని ఆరోపించారు. ప్రభుత్వ పథకాలు కాంగ్రెస్ పార్టీ వారికే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో గ్రామసభను ముగించుకుని కోదాడ ఎమ్మార్వో అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
యాదాద్రి భువనగిరి జిల్లా రాయరావు పేట గ్రామసభలోనూ గందరగోళం నెలకొంది. అధికారులతో గ్రామస్థులు వాగ్వాదానికి దిగారు. అర్హులమైనా… తమ పేర్లు ముసాయిదాలో లేకపోవడంపై అధికారులను నిలదీశారు. ఇళ్లు ఉన్నవారికే ముసాయిదాలో చోటు దక్కిందని గ్రామస్థులు నిలదీశారు. గ్రామస్థులను అడ్డుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు అధికారులు.
అటు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో నిర్వహించిన ప్రజా పాలన వార్డు సభలు రసభాసగా మారాయి. పట్టణంలోని ఒకటో వార్డులో ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులలో పేర్లు రాలేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఒకే కుటుంబంలో ఇద్దరికీ, స్థానికంగా లేని వారికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడే ఉన్న బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. గతంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎంతమందికి ఇచ్చారని కాంగ్రెస్ శ్రేణులు నిలదీయడంతో, రాజకీయాలు వద్దని అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని బిఆర్ఎస్ శ్రేణులు వాగ్వాదానికి దిగారు.
ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులలో పేర్లు రానివారు వార్డు సభలో దరఖాస్తులు ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో అర్హులైన వారి పేర్లను కమిషనర్ చదివి వినిపించారు. సర్వేలో వచ్చిన వారి పేర్లు ఫైనల్ కాదని అందులో కూడా అర్హులను గుర్తించిన తర్వాతే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని కమిషనర్ తెలిపారు.


