స్వతంత్ర వెబ్ డెస్క్: మరో రెండు మూడ్రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో తెలంగాణలో రాజకీయం రాజుకుంటోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నారు. మరోవైపు అధికార పార్టీ వైఫల్యాలను కాంగ్రెస్, బీజేపీ ఎండగడుతుంటే.. ఆ పార్టీలపై బీఆర్ఎస్ తీవ్రంగా విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన.. నిజామాబాద్ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నిజామాబాద్ సభలో మోదీ.. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. వాటిపై బీఆర్ఎస్ మంత్రులు తీవ్రంగా స్పందిస్తున్నారు. బీఆర్ఎస్కు బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే మీడియాతో మాట్లాడిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్.. మంత్రి కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేటీఆర్ ముఖ్యమంత్రి అంటే రాష్ట్ర ప్రజలు భరించలేరని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్పై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకతకు కేటీఆరే కారణమని అన్నారు. కేసీఆర్ కుటుంబ ఆస్తులు 2014కు ముందు ఎంత?, ఇప్పుడున్న ఆస్తులెంత? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభానికి ముందు ఎంత?, ఉద్యమంలోకి వచ్చిన తర్వాత ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ వ్యాపారాలు లేని కేసీఆర్ కుటుంబ ఆస్తులు ఇంత భారీగా ఎందుకు పెరిగాయని.. దేశవ్యాప్తంగా విపక్షాలకు డబ్బు సాయం చేసేంత సంపద కేసీఆర్‌కు ఎక్కడిది? అని బండి సంజయ్ నిలదీశారు.