స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్న వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. ఇవాళ ఒక్కరోజే ఇద్దరు ఎమ్మెల్యేలను ప్రజలు అడ్డుకోవడం.. వారిపై తీవ్ర నిరసన వ్యక్తం చేయడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. యలమంచిలి నియోజకవర్గం ఎమ్మెల్యే కన్నబాబు రాజును ప్రజలు అడ్డుకుని నిరసన తెలపగా.. పెనుకొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకరనారాయణకు సొంత పార్టీ నేతల నుంచే ఛీత్కారం ఎదురైంది. గడపగడపకు కార్యక్రమానికి వస్తున్న శంకర్ నారాయణను ఈదులబలాపురం పరిధిలోని రేణుకనగర్ సమీపంలో గ్రామస్తులు అడ్డుకున్నారు.
ఐదు నెలలపాటు రేషన్ బియ్యం ఇవ్వలేదని.. రోడ్లు, డ్రైనేజీలు నిర్మించకుండా అభివృద్ధికి అడ్డంకిగా ఎమ్మెల్యే మారారని ఆరోపించారు. గ్రామస్తులు తమ సమస్యలు చెబుతున్నా వినకుండా ఎమ్మెల్యే వెనుదిరిగారు. దీంతో మరింత ఆగ్రహంతో ఊగిపోయిన ప్రజలు శంకర్ నారాయణ వాహనంపై రాళ్లు, చెప్పులు విసిరారు. వైసీపీకి చెందిన నాగభూషణ్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఎమ్మెల్యేను అడ్డుకోవడం గమనార్హం.
ఈదలబలాపురం గ్రామంలో అభివృద్ధిని ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని నాగభూషణ్ రెడ్డి ఆరోపించారు. ఐదు నెలలుగా రేషన్ సరుకులు ఇవ్వకుండా గ్రామస్థులను అవమానిస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీ నేత కాబట్టి వదిలిపెట్టామని, లేదంటే శంకరనారాయణను బట్టలూడదీసి కొట్టేవాళ్లమని ఆయన హెచ్చరించారు. సొంత పార్టీ కార్యకర్తలే ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం, ఆయన కారుపై చెప్పులు విసరడం అధికార పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది.


