ఒకవైపు భగ్గున మండుతున్న ఎండలు. మరోవైపు ఎన్నికల ప్రచారానికి దగ్గర పడుతున్న గడువు. మరో వంద గంటల లోపు ఎన్నికల ప్రచారం ముగియబోతోంది. దీంతో చివరిరోజుల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తు న్నాయి ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని రాజకీయ పార్టీలు. ఆంధ్రప్రదేశ్‌లోని ఏ పట్టణం చూసినా, ఏ మండల కేంద్రం చూసినా, ఒకటే సీన్ కనిపిస్తోంది. అభ్యర్థుల పెద్ద పెద్ద హోర్డింగులు, ఫలానా అభ్యర్థికి ఓటే యండి అంటూ పెట్టిన ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. ఏ గల్లీలో చూసినా ర్యాలీలే కనిపిస్తున్నాయి. పార్టీ జెండాలతో తిరుగుతున్న వాహనాలే సందడి చేస్తున్నాయి.
ఎన్నికల ప్రచారానికి కౌంట్‌డౌన్ ప్రారంభం కావడంతో అన్ని పార్టీల నుంచి బడా నాయకులు రాష్ట్రానికి వస్తున్నారు. తమ అభ్యర్థుల ప్రచారంలో పాల్గొంటున్నారు. బడా నాయకులు వస్తుండటంతో ఆయా సభలకు ప్రజలను తీసుకెళ్ల డానికి స్థానిక నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారు. కూటమి అభ్యర్థులకు మద్దతుగా రాజమండ్రి, అనకాపల్లి ఎన్నికల ప్రచారసభల్లో ఆయన పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీ నాయకత్వంలోని కూటమి విజయం సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా డబుల్ ఇంజన్ సర్కార్ నినాదం ఇచ్చారు ఆయన. కేంద్రం, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే అభివృద్ది వేగంగా జరుగుతుందన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారు. తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలోని కూటమికి మద్దతుగా అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. కూటమి అభ్యర్థులను గెలిపించాల్సిందిగా ఓటర్లను కోరారు. తాజాగా పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెరమీదకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ జాప్యం కావడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారే కారణమని ఘాటు ఆరోపణలు చేశారు అమిత్ షా. కేంద్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే రెండేళ్లలో పోలవరం ప్రాజెక్ట్ ను నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఒకవైపు బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి కూటమికట్టి ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తుంటే, మరోవైపు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం సిద్ధం అంటూ బహిరంగ సభలు నిర్వహిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి అమిత్ షా, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూటమికి స్టార్ క్యాంపెయినర్లుగా మారారు. అయితే అధికారపక్షమైన వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు మాత్రం స్టార్ క్యాంపెయినర్‌గా ఒకే ఒక వ్యక్తి వ్యవహరిస్తు న్నారు. ఆ స్టార్ క్యాంపెయినర్ మరెవరో కాదు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే. ఎక్కడకు వెళ్లినా , సిద్ధమా !అంటూ తనదైన స్టయిల్‌లో ఓటర్లను పలకరించి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి.
ఐదేళ్లపాటు తమ ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను ఈ సందర్భంగా వివరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ప్రధానంగా వృద్దులకు ఇస్తున్న పెన్షన్‌లను ప్రస్తావిస్తున్నారు. చిన్నారుల భవితవ్యం కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. కాగా ఎవరికివారు విజయం తమదే అంటున్నారు అన్ని రాజకీయపార్టీల నాయకులు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది తామే అంటున్నారు. ప్రత్యర్థుల కు జనాదరణ లేదని తమదైన స్టయిల్‌లో ఎద్దేవా చేస్తున్నారు. ఇదిలాఉంటే అన్ని రాజకీయ పార్టీల సభలకు జనం తండోపతండాలుగా వస్తున్నా రు. ఏ నాయకుడు ప్రసంగించినా, ఆనందంతో కేరింతలు కొడుతున్నారు. చప్పట్లు కొడుతు న్నారు. దీంతో అన్ని పార్టీలు ఈసారి ఓటర్లు తమవైపే ఉన్నారని భావిస్తున్నారు. మొత్తంమీద ఓటరు మాత్రం గుంభనం గా ఉంటున్నాడు. ఓటరు నాడి పసిగట్టడం అంత సులభంగా కనపడటం లేదు.