అదానీ సోలార్ పవర్ సేల్ అగ్రిమెంట్ల వ్యవహారం.. ఇందుకోసం భారీ మొత్తంలో ఇవ్వజూపిన లంచాల అంశం.. ప్రపంచవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. పైగా ఇందులో ఏపీ మాజీ సీఎం జగన్ పాత్ర ఉందంటూ వచ్చిన వార్తలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి. ఏ ఇద్దరు కలిసినా ఇప్పుడు ఈ అంశంపైనే చర్చించుకునే పరిస్థితి నెలకొంది.
అయితే.. ఈ మొత్తం వ్యవహారంలో రోజులు గడుస్తున్న కొద్దీ కొత్త కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అదానీ-అజూర్ గ్రూప్ పవర్ సేల్ అగ్రిమెంట్లను ఏపీ టీడీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గతంలోనే వ్యతిరేకించిన అంశం ప్రస్తుతం బయటకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అదానీ-అజూర్ పవర్ నుంచి వైసీపీ సర్కారు సోలార్ విద్యుత్ కొనే ఒప్పందంపై…సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ముందు రాతపూర్వకంగా అభ్యంతరాలు వ్యక్తం చేశారు నాడు పీఏసీ ఛైర్మన్‌గా ఉన్న పయ్యావుల కేశవ్. మొత్తం 16 అభ్యంతరాలతో 2022 ఫిబ్రవరి 24న CERCకి తన అభ్యంతరాలు తెలిపారు.
బహిరంగ మార్కెట్‌లో అప్పటికి సోలార్ ఎనర్జీ రేటు తగ్గుతోంది. ఇంకా చెప్పాలంటే సెకీతో ఒప్పందం కుదుర్చుకునే సమయంలో యూనిట్ విద్యుత్‌కు ఒక రూపాయి 99 పైసల నుంచి రెండు రూపాయలకు సరఫరా చేస్తున్నారు. కానీ, నాటి జగన్ సర్కారు యూనిట్‌కు 50 పైసలు అదనంగా చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకోవడంపై పయ్యావుల అభ్యంతరం తెలిపారు. అయినా ఈ మొత్తం డీల్ ముందుకే వెళ్లడంతో టీడీపీ ఎమ్మెల్యేగా, పీఏసీ ఛైర్మన్‌గా ఉన్న పయ్యావుల కేశవ్ హైకోర్టును ఆశ్రయించారు. ఇంకా ఆ కేసు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం వద్ద పెండింగ్‌లోనే ఉంది. కేవలం పయ్యావుల కేశవ్ మాత్రమే కాదు.. సీపీఐ నేత రామకృష్ణ సైతం ఇదే అంశంపై 2021లో హైకోర్టును ఆశ్రయించారు. ఇది కూడా ప్రస్తుతం ఏపీ హైకోర్టు వద్ద పెండింగ్‌లోనే ఉంది. మరి.. రాబోయే రోజుల్లో ఈ అంశంపై హైకోర్టులో ఏం జరుగుతుంది అన్నది ఆసక్తి రేపుతోంది.