ఏపీ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. పిన్నపురం వద్ద నిర్మాణంలో ఉన్న గ్రీన్ కో రెన్యువబుల్ ఎనర్జీ కంపెనీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పవర్ హౌస్ తో పాటు, పంపు స్టోరేజ్ ప్లాంట్‌ను పరిశీలిస్తారు.
గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో 11 గంటలకు బయలుదేరి ఓర్వకల్లుకు చేరుకుంటారు. ఆసియాలోనే అతిపెద్ద సోలార్ ప్రాజెక్ట్, నిర్మాణంలో ఉన్న రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టుని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు. అక్కడి నుండి గని సోలార్ పార్కుకు చేరుకొని సంబంధిత వ్యక్తులతో చర్చిస్తారు. ఈ కార్యక్రమం అనంతరం పొన్నాపురం చేరుకొని అక్కడ గ్రీన్‌కో ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పంపు స్టోరేజ్ ప్లాంట్‌ని పరిశీలించి విద్యుత్ ఉత్పత్తిపై ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పరిశీలించి సంబంధిత అధికారులతో సమావేశమవుతారు. సాయంత్రం తిరిగి విజయవాడ బయల్దేరి వెళ్తారు పవన్ కళ్యాణ్.
డిప్యూటీ సీఎం ఈనెల 9న కర్నూలు పర్యటనకు వెళ్లాల్సి ఉంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనతో పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఆ రోజు తిరుపతికి వెళ్లి ఘటనాస్థలిని పరిశీలించి, బాధితులను పరామర్శించారు. నిన్న పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్.. ఇవాళ కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు.