స్వతంత్ర, వెబ్ డెస్క్: జనసేన అభిమానులకు శుభవార్త అందించారు పార్టీ అధినేత పవన్ కల్యాణ్. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 14 నుంచి వారాహి వాహనం రోడ్డెక్కుతుందని పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. పీఏసీ సభ్యులతో సమావేశమైన నాదెండ్ల మనోహర్ పవన్ పర్యటనపై చర్చించి రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. తొలి విడతగా తూర్పు గోదావరి జిల్లాలోని నియోజకవర్గాల్లో పవన్ వారాహి యాత్ర ఉంటుందని ఆయన చెప్పారు.
జూన్ 14న అన్నవరం క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వారాహి యాత్ర ప్రారంభమవుతుందన్నారు. అన్నవరం నుంచి భీమవరం వరకు యాత్ర సాగుతుందని.. ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, ముమ్మిడివరం, రాజోలు, పి.గన్నవరం, నరసాపురం నియోజకవర్గాల్లో పవన్ పర్యటిస్తారని నాదెండ్ల వెల్లడించారు. యాత్రలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో అందరినీ కలుపుకుని ముందుకు పోతామని పేర్కొన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ఈ యాత్ర దోహదపడుతుందన్నారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ తమ లక్ష్యమన్నారు. అయితే ఈ యాత్రతో పొత్తులకు సంబంధం ఉండదని నాదెండ్ల క్లారిటీ ఇచ్చారు.