సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చే విషయంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. పనిచేసే వారిని తప్పకుండా గుర్తించి అందుకు సరైన గౌరవం ఇస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలో మీడియా చిట్ చాట్‌లో ఆయన మాట్లాడారు. తనతో సమానంగా సోదరుడు నాగబాబు పనిచేశారని.. ఆయనకు తన సోదరుడగా కేబినెట్‌లో అవకాశం ఇవ్వలేదని అన్నారు. తన సోదరుడు కాకపోయినా, కాపు సామాజికవర్గం కాకపోయినా.. ఆ స్థానంలో ఉన్న వాళ్లు ఎవరైనా సరే అవకాశం ఇచ్చేవాడినని చెప్పారు.
అన్నయ్య చిరంజీవి సొంతంగా కష్టపడి ఎదిగారు. మా తర్వాతి తరానికి బ్యాక్ గ్రౌండ్ ఉంది. పార్టీ కోసం నాగబాబు కష్టపడి పనిచేశారు. వైసీపీ నేతలతో తిట్లు కూడా తిన్నారు. కందుల దుర్గేష్‌ది ఏ కులమో నాకు తెలియదు. నాదెండ్ల మనోహర్ స్థానంలో ఎవరైనా ఎస్సీ, బీసీ నేత..నాతో కలిసి పనిచేసి ఉంటే వాళ్లకే అవకాశం ఇచ్చేవాడిని. కలిసి పార్టీ అభివృద్ధి కోసం పనిచేసేవాళ్లను..వారసత్వంగా చూడలేం. మార్చిలో నాగబాబు ఎమ్మెల్సీ అవుతారు. ఎమ్మెల్సీ అయ్యాకే కేబినెట్‌లోకి నాగబాబును తీసుకుంటాం.. అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.