సోమవారం ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ తన భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ తో కలిసి మహా కుంభమేళాకు వెళ్లారు. కుటుంబం అంతా గంగా నదిలో పవిత్ర స్నానం చేసి అనంతరం పవిత్ర పూజలు చేశారు. ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వంతు వచ్చింది.
మహా కుంభమేళాలో పుణ్యస్నానం కోసం పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా మంగళవారం సాయంత్రం ప్రయాగ్‌రాజ్ చేరుకున్నారు. ఆయన భార్యతో పాటు కుమారుడు అకీరా కూడా త్రివేణి సంగమంలో పుణ్య స్నానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో మహా కుంభ్‌లో ఏర్పాట్లపై కళ్యాణ్ సంతృప్తి వ్యక్తం చేశారు.
“ఇది మనందరికీ ఒక గొప్ప అవకాశం. మనం భాష ,సంస్కృతిలో విభిన్నంగా ఉన్నప్పటికీ, మతపరంగా అందరం ఐక్యంగా ఉన్నాం” అని పవన్ కళ్యాణ్ అన్నారు.
పవన్ కళ్యాణ్ ఇటీవల సనాతన ధర్మ పద్ధతులను ప్రచారం చేయడంలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఇవాళ ఆయన మహా కుంభమేళా సందర్శన కూడా ఇదే విషయాన్ని బలపరుస్తుంది.
ఇటీవలె పవన్ కళ్యాణ్ , అతని కుమారుడు అకీరా నందన్ ఇటీవల కేరళ , తమిళనాడులలో పర్యటించి అనేక పవిత్ర దేవాలయాలను సందర్శించిన సంగతి తెలిసిందే. సనాతన పర్యటన నుండి తిరిగి వచ్చిన రెండు రోజుల తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం ఇప్పుడు మహా కుంభమేళాలో పుణ్యస్నానమాచరించారు.