ఏలేరు వరద ఉధృతిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. కాకినాడ జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారాయన. ఎగువున కురిసిన భారీ వర్షాలకు ఏలేరు, తాండవ రిజర్వాయర్లకు ఇన్ ఫ్లో ఎక్కువగా ఉందని కలెక్టర్ చెప్పారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 62 వేల ఎకరాలు ముంపునకు గురయ్యాయని పవన్‌కు తెలిపారు. గండ్లు పడటం, రహదారులపైకి వరద నీరు చేరడంతో పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాల్లో పలు చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందన్నారు. పిఠాపురం – రాపర్తి, పెద్దాపురం – గుడివాడ, సామర్లకోట – పిఠాపురం మార్గాల్లో రాకపోకలు స్తంభించాయని వివరించారు. గొల్లప్రోలు దగ్గర జాతీయ రహదారిపై ప్రవాహం ఎక్కువగా ఉండడంతో వాహనాలను దారి మళ్లించినట్లు తెలిపారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలకు అవసరమైన పడవలు, సహాయక బృందాలు పూర్తి స్థాయిలో పని చేస్తున్నాయని వివరించారు.
ఏలేరుకి వరద ఉధృతి క్రమంగా తగ్గుతోందని కలెక్టర్ వివరించారు. ఇవాళ ఉదయం 8 గంటలకు 12 వేల 567 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చిందని చెప్పారు. జలాశయం పూర్తి సామర్థ్యం 24.11 TMCలు కాగా ప్రస్తుతం 22.16 TMCలుగా ఉందని వివరించారు. నాలుగు గేట్లు ఎత్తినట్లు పవన్ కళ్యాణ్‌కు కలెక్టర్ చెప్పారు.
NDRF, SDRF , ఆర్మీ బృందాల సేవలను వినియోగించుకోవాలని పవన్ కళ్యాణ్ కలెక్టర్‌కు సూచించారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయాలన్నారు. వరద చుట్టుముట్టిన ప్రజలకు ఆహారం, నీరు, పాలు అందించాలని ఆదేశించారు. ఏలేరు వరదతో పంటలు కోల్పోయిన రైతులతో ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం మాట్లాడుతూ ధైర్యం చెప్పాలన్నారు పవన్ కళ్యాణ్.