అన్నమయ్య జిల్లాలో పర్యటిస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్. స్వర్ణ గ్రామపంచాయతీ కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ పథకంపై రాష్ట్రస్థాయి గ్రామసభను రైల్వేకోడూరు మండలం మైసూరువారిపల్లెలో నిర్వహించింది ప్రభుత్వం. ఈ కార్యక్రమానికి హాజరయ్యారు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్. పవన్ పర్యటనతో జనం భారీగా తరలివచ్చారు. పవన్ అక్కడకు చేరుకోగానే పార్టీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.
గ్రామాభివృద్ధిపై ఫోకస్ పెట్టిన కూటమి సర్కార్.. స్వర్ణ గ్రామపంచాయతీ పేరిట ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. నాలుగు అంశాలతో గ్రామీణాభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించనుంది.ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా 13 వేల 326 గ్రామ పంచాయతీల్లో ఒకేరోజున గ్రామసభలు నిర్వహించింది. సర్పంచి అధ్యక్షతన నిర్వహిస్తున్న గ్రామసభల్లో ప్రజలు పాల్గొని గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం నిర్దేశించిన నాలుగు అంశాలపై చర్చించి తీర్మానం చేయనున్నారు.
మొదటి అంశంలో ఇళ్లకు విద్యుత్, తాగునీటి కనెక్షన్లు, మరుగుదొడ్డి సదుపాయం, వంటగ్యాస్ కనెక్షన్లు ఇవ్వడంపై చర్చించనున్నారు. రెండో అంశం కింద మురుగు కాలువలు, మురుగునీటి వ్యవస్థ నిర్వహణ, వీధి దీపాలు, సిమెంట్ రహదారులు, ఘనవ్యర్థాల నిర్వహణపై చర్చిస్తారు. అలాగే మూడో అంశంగా గ్రామంలో అంతర్గత రహదారుల నిర్మాణంతోపాటు గ్రామాల నుంచి మండల కేంద్రాలకు లింక్‌రోడ్లపై చర్చలు జరుపుతారు. నాలుగో అంశంగా ఇంకుడుగుంతలు, పంటకుంటల నిర్మాణం, ఉద్యానవన, పట్టు పరిశ్రమ అభివృద్ధికి సదుపాయాల కల్పన, పశువుల పెంపకంపై చర్చించనున్నారు.గ్రామసభల ద్వారా ప్రజలందరికీ ఉపాధి హామీ పథకంపై అవగాహన కల్పించి ఇందులో నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలని సర్కార్ భావిస్తోంది. ఈ మేరకు అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం మైసూరువారిపల్లె గ్రామ సభలో పాల్గొన్నారు పవన్‌కల్యాణ్.