ప్రతిపక్ష హోదా గురించి, పలు అంశాల గురించి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యంగా బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో జగన్ తనకు రాసిన లేఖ గురించి మాట్లాడుతూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఓ రూలింగ్ తీసుకొచ్చారు. జగన్ లేఖలో మాట్లాడుతూ.. తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ అవాక్కులు, చెవాక్కులు పేలారని.. ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం ఆ పార్టీకి లేదని జగన్‌కు తెలిసీ కూడా తమకు ఇవ్వాలి అంటూ లేఖ రాయడం ఏంటని స్పీకర్ అయ్యన్న అసెంబ్లీలో మాట్లాడారు. దీనికి జగన్ కౌంటరిచ్చారు.
అసెంబ్లీలో ఉండేది రెండే పక్షాలు. ఒకటి అధికార పక్షమే అయితే.. రెండోది విపక్షమే అవుతుంది కదా.. తమకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారూ అంటూ జగన్ ప్రశ్నించారు. 175 మంది ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యేకి ఇచ్చే సమయమే ఇస్తామూ.. ప్రతిపక్ష నేతగా తమను గుర్తించమూ అంటే ఎలా కుదురుతుంది అంటూ ప్రశ్నించారాయన. అసలు ఎక్కడా రూలింగ్ లేదు.. ఇన్ని ఎమ్మెల్యేలు సాధించిన వారికి మాత్రమే ప్రతిపక్ష హోదా వస్తుందన్న రూలింగ్ ఏమీ లేదని వైఎస్ జగన్ ఈ సందర్భంగా మాట్లాడారు.
చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఇచ్చింది తానేనని చెప్పారు జగన్. ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి మూడే స్థానాలు ఉన్నా ఆప్.. బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చిందని గుర్తు చేశారు. తమ ప్రభుత్వ హయాంలో టీడీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చామని.. ఎంతసేపైనా మాట్లాడేందుకు చంద్రబాబుకు సమయం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని.. తర్వాత తాను సమాధానం చెబుతానని కూడా చెప్పానని చెప్పారు. టీడీపీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలను లాగుతామంటే నేనే ఒద్దన్నానని జగన్ చెప్పారు.
ఇక జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశం చివరలో పవన్ గురించి మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు. సీట్ల ఆధారంగానే ప్రధాన ప్రతిపక్ష హోదా నిర్దేశించబడుతుందని.. ఓట్ల శాతం ఆధారంగ ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కావాలంటే జర్మనీ వెళ్లాలని పవన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. దీనిపై స్పందించిన వైఎస్ జగన్.. పవన్ కల్యాణ్ కార్పొరేటర్ కు ఎక్కువ… ఎమ్మెల్యేకు తక్కువ అంటూ ఘాటు వ్యాఖ్య చేశారు. అంతటితో ఆగని జగన్… జీవిత కాలంలో ఆయన తొలి సారి ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారంటూ కామెంట్ చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది- జగన్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని.. గతంలో ఎప్పుడైనా ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరగడం చూశామా.. అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వానికి శ్రీకాకుళంలో గవర్నమెంట్ , ప్రైవేటు టీచర్లు బాగా బుద్ది చెప్పారని.. అక్కడ రిగ్గింగ్ చేయడం కష్టమని అన్నారు.