ఏపీ ఉప ముఖ్యమంత్రి , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ ప్రచారం నిమిత్తం దక్షిణ భారతదేశంలోని ఆలయాల సందర్శనకు శ్రీకారం చుట్టాలని పవన్ నిర్ణయించుకున్న మాట వాస్తవం. అయితే అనారోగ్య కారణాలతో ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారనే వార్తలు వచ్చాయి. మళ్లీ సడెన్‌గా ఆయన కేరళలో ప్రత్యక్షమయ్యారు.
నిన్నటికి నిన్న సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సమావేశానికి డుమ్మా కొట్టారు. పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి సమీక్ష ప్రారంభమయ్యే సమయంలో మంత్రి నాదెండ్ల మనోహన్ కల్పించుకుని.. పవన్ కు ఆరోగ్యం బాగాలేదని.. తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతున్నారని చెప్పారు. అందుకే ఆయన సమావేశానికి రాలేదని చెప్పినట్టు తెలిసింది. రెండు మూడు రోజుల్లో విధులకు హాజరవుతారని కూడా చెప్పారాయన. చంద్రబాబు సమాధానమిస్తూ పవన్ కళ్యాణ్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించినా దొరకలేదని.. ఇప్పుడెలా ఉన్నారని అడిగారు.
కట్ చేస్తే పవన్ కళ్యాణ్ ఇవాళ పుణ్య క్షేత్రాల సందర్శనకు బయల్దేరారని జనసేన వర్గాలు ప్రకటించాయి. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు పుణ్యక్షేత్రాలు దర్శించుకునే యాత్రకి శ్రీకారం చుట్టారని.. ఇందులో భాగంగా కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి కొద్దిసేపటి క్రితం చేరుకున్నారని ప్రకటించారు. కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకుంటారని అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి.
వీడియోల్లో పవన్ కళ్యాణ్ చాలా హుషారుగా, ఉత్సాహంగా కనిపిస్తున్నారు. అంతేకాదు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన కాషాయ వస్త్రాల్లో కనిపించారు. నిన్న సమావేశానికి హాజరుకావడానికి అనారోగ్య కారణాలు చెప్పిన పవన్.. ఇవాళ్టికి ఇవాళ దక్షిణ పుణ్య క్షేత్రాల యాత్రకు బయల్దేరారు. అందులోనూ పూర్తి ఆరోగ్యంగా. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చంద్రబాబు ఫోన్‌కి అందుబాటులోకి రాలేదని.. నిన్న స్వయంగా ఆయనే చెప్పారు.
ఇదిలా ఉంటే ఇటీవల చంద్రబాబు మంత్రుల పనితనానికి ఇచ్చిన ర్యాంకుల్లో పవన్ కళ్యాణ్‌కు 10వ ర్యాంకు ఇచ్చారు. దీన్ని బట్టి ఆయన టేబుల్స్ నుంచి ఫైళ్లు కదలడం లేదని తెలుస్తోంది. కేవలం అనారోగ్య కారణాలు చెప్పి నిన్న మీటింగ్‌కి డుమ్మా కొట్టారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.