జీవన్ రెడ్డిని చూస్తే మనస్సు తరుక్కుపోతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. ముఖ్య అనుచరుడు గంగారెడ్డి హత్య, తదనంతర పరిణామాలు, అధిష్ఠానానికి జీవన్ రెడ్డి లేఖ నేపథ్యంలో జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. జీవన్ రెడ్డి ఒంటరి కాదని జగ్గారెడ్డి అన్నారు. సమయం వచ్చినప్పుడు ఆయనకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆయన రాజకీయ జీవితమంతా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిందన్నారు. కానీ ఇప్పుడు అడుగడుగునా కష్టాలు రావడం చూస్తే బాధేస్తోందన్నారు.
తాను ఎవరినీ తప్పుపట్టడం లేదని… కానీ జీవన్ రెడ్డి మాత్రం ఒంటరి అని ఎవరూ భావించవద్దని కోరారు. తామిద్దరం ఎప్పుడూ ప్రజలకు అందుబాటులోనే ఉంటామని, కానీ తనను సంగారెడ్డిలో, జీవన్ రెడ్డిని జగిత్యాలలో ప్రజలు ఎందుకు ఓడించారో అర్థం కావడం లేదన్నారు. జీవన్ రెడ్డి అంశంపై అధిష్ఠానం దృష్టి సారించాలని జగ్గారెడ్డి కోరారు.