లోక్‌సభ ఎన్నికల పోరుకు నేడో, రేపో తెరలేవనుండటంతో రాజకీయ వేడి జోరందుకుంది. ఎన్నికల షెడ్యూల్ జారీకి రంగం సిద్ధం కావడంతో ప్రధాన పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాలకు పదునుపెడు తున్నాయి. ఒకవైపు అభ్యర్ధుల ఖరారుకు కసరత్తు చేస్తూనే, అధికార పార్టీకి చెందిన మంత్రులు ఎమ్మెల్యే లు అభివృద్ది పనులకు జోరుగా శంకుస్థాప నలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. కోడ్ కూయక ముందే జాగ్రత్త పడుతున్నారు. విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి భద్రాచలంలో పర్యటించగా, నలుగురు మంత్రులు వైరా లింక్ కెనాల్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఇక ఖమ్మం ఎంపీ స్ధానానికి బీఆర్‌ఎస్ ఇప్పటికే నామ నాగేశ్వరరావు అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేయగా, కాంగ్రెస్, బీజేపీ గెలుపు గుర్రాల కోసం కసరత్తు చేస్తున్నాయి. మొత్తం మీద షెడ్యూల్ విడుదలకు ముందే లోక్‌సభ ఎన్నికలు కాకరేపుతున్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల బృందం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించింది. భద్రాచలం సీతారామచంద్ర స్వామిని దర్శించుకోని అక్కడే 5 లక్షల రూపాయల ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని ప్రారంభిం చారు. పనిలో పనిగా భద్రాచలం కరకట్ట పనుల పూర్తికి, ఆలయ అభివృద్దికి, రాష్ట్ర విభజన సమయంలో ఏర్పడిన ఐదు పంచాయతీల సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు. మణుగూరులో నిర్వహించిన ప్రజాదీవెన సభ ద్వారా లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ ఉమ్మడి జిల్లాలో అధికారికంగానే శ్రీకారం చుట్టింది. మహబూబబాద్ లోక్‌సభ అభ్యర్థిగా బలరాం నాయక్ పేరును ప్రకటించడంతో పాటు లక్షా 50వేల మెజారిటీ గెలిపించాలని పిలుపునిచ్చారు.
మరోవైపు ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధి ఎంపిక కోసం ఢిల్లీలో కసరత్తు జరుగుతోంది . జిల్లా నుంచి ఆశావహులు పెద్ద ఎత్తున ఉండటం..ముగ్గురు మంత్రుల కుంటుంబ సభ్యులు టికెట్లు ఆశిస్తుండటంతో అధిష్టానానికి పెద్ద సమస్యగా మారింది. జిల్లాకు చెందిన వారికి టికెట్ ఇస్తారా లేక బయట నుంచి కొత్త వ్యక్తులు వస్తారా అన్నదానిపై చర్చ కొనసాగుతోంది. ఒకవైపు అభ్యర్థి ఎంపిక కసరత్తు సాగుతుండగా మరోవైపు జిల్లాలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొంగులేటి, తుమ్మల అభివృద్ది కార్యక్రమాలకు శంస్థాపనలు సాగిస్తున్నారు. ఎన్నికల కోడ్ వస్తుందని గమనించి ప్రజా ప్రతినిధులంతా అలర్ట్ అయ్యారు. ఇటీవల మధిర నియోజకవర్గంలో భట్టి విక్రమార్క, పాలేరులో పొంగులేటి, ఖమ్మం నియోజకవర్గంలో తుమ్మల తమ నియోజకవర్గాల్లో మంజూరైన రహదా రుల పనులకు శంకుస్ధాపనలు చేశారు. అధికారులతో రివ్యూ సమావేశాలు నిర్వహించి జిల్లాలో నీటి ఎద్దడి రాకుండా జాగ్రత్తలపై దృష్టి సారించారు. వీరితో పాటు నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా తమ కోటా కింద మంజూరైన నిధులకు శంకుస్ధాపనలతో బిజీగా ఉన్నారు.
ఖమ్మం పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ నుండి అభ్యర్ధి తేలకపోయినా తమ నియోజకవర్గాలలో… అసెంబ్లీ ఎన్నికల ఆధిక్యతను మళ్లీ చూపించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచే కుస్తీ పడుతున్నారు. ఇక విపక్ష బీఆర్‌ఎస్ అభ్యర్ధిగా ఖమ్మం నుంచి తిరిగి నామా నాగేశ్వరరావుకు టికెట్ కేటాయించారు. ఇటీవల ఖమ్మంలో లోక్‌సభ స్థాయి బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించింది. బీఆర్ఎస్ నుండి రాజ్యసభకు ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర అభినందన సభతో ఎన్నికల ప్రచార సభను కూడా బీఆర్‌ఎస్ ప్రారంభించింది. ఎంపీ అభ్యర్ధి నామా నాగేశ్వరరావు కుమారుడి వివాహ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. వివాహం తరువాత ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ప్రచారం.
ఇక బీజేపీ కూడా జిల్లాలో ఎన్నికల శంఖం పూరించబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే బీఆర్ఎస్‌కి చెందిన మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావును పార్టీలో చేర్చుకుంది. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గానికి జలగాన్ని రంగంలోకి దింపనుంది. ఇటీవల బీజేపీలో చేరిన సీతారాం నాయక్‌ను..మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి రంగంలోకి దింపనున్నట్లు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అభ్యర్ధుల పేర్లు వెల్లడి కాగానే కమల దళం కూడా లోక్‌సభ ఎన్నికల ప్రచారంలోకి అడుగు పెట్టబోతుంది. కేంద్ర మంత్రులు విస్తృతంగా ప్రచారం చేయడంతోపాటు అగ్ర నేతలు ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా ఉమ్మడి జిల్లా పర్యటనకు వచ్చే అవకాశం లేకపోలేదు. ఇక వామ పక్షాలు తాము ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటనలు చేస్తున్నాయి. పొత్తులో ఒక స్ధానమైన కేటాయిం చాలని సీపీఐ డిమాండ్ చేస్తున్నా కాంగ్రెస్ నుంచి సానుకూల స్పందన లేదు. ఢిల్లీలో మాట్లాడుకోవాలని సీపీఐకి రాష్ర్ట కాంగ్రెస్ నేతలు చెపుతున్నారు. సీపీఎం ఒంటరిగా పోటీ చేస్తామని చెబుతున్నా ఇంకా అభ్యర్ధులను ప్రకటించలేదు. మొత్తానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల వేడి వేసవి వేడిని తలపిస్తుంది.


