పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూకుడు పెంచాయి. తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాల్లో విజయం సాధిస్తామని కమలనాధులు చెబుతున్నారు. అందు కోసం పకడ్బందీగా ప్రచారం వ్యూహాన్ని రూపొందించారు. ప్రచార ఇన్‌ఛార్జ్‌లుగా పార్లమెంట్ ప్రభారీలను రాష్ట్ర కమిటీ నియమించింది. ఆర్భాటంగా ప్రకటించిన పార్లమెంట్ ప్రభారీలు, కన్వీనర్లతో పాటు పార్టీ ముఖ్యనేతలు ప్రచారంలో ఎక్కడా కనిపించడం లేదు.
పార్లమెంట్ ఎన్నికలు బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టాలన్నా..మోడీ మూడోసారి ప్రధాని కావాలన్నా ఈ ఎలక్షన్ ఎంతో కీలకం. అందుకే ప్రజల్లో ఇతర పార్టీలపై ఉన్న వ్యతిరే కతను వెంటనే క్యాష్ చేసుకో వాలనుకుంది. ఈనేపధ్యంలోనే అన్ని పార్టీల కంటే ముందుగా అభ్యర్థు లను బీజేపీ ప్రకటించింది. దీని వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవద్దని, ఇబ్బంది ఎదురైనా సమన్వ యం కోసం ఇన్ఛార్జ్లు, ప్రభారీలను నియమించింది. అయినా సమస్యలు సద్దుమణగకపోగా మరింత గా పెరగుతున్నాయి. పాత, కొత్త నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో శ్రేణులు ఉత్సాహంగా పార్టీ యాక్టివిటీలో పాల్గొనలేని పరిస్థితి ఏర్పడింది. ఆయా పార్లమెంట్ సెగ్మెంట్లలో అభ్యర్థులు తప్పితే ఇన్ఛార్జ్లు, జిల్లా అధ్యక్షులు చెప్పుకోదగినన్ని కార్యక్రమాలు పార్టీ శ్రేణులు చేయడంలేదనే విమర్శలు వస్తున్నాయి.
తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలున్నాయి. ప్రతి లోక్‌సభ స్థానానికి పార్టీ ఒక్కో కీలక నేతను ఇన్ఛార్జీగా నియమించింది. అలాగే 17 స్థానాలకు 17 మంది ప్రభారీలను నియమించింది. కాగా, కీలక బాధ్యతలు ఇన్‌ఛార్జీలపై ఉంది. నియమించిన కొత్తలో కాస్త హడావుడి చేసిన నేతలు ఆ తర్వాత కాస్త సైలెంటయ్యారనే టాక్ వినిపిస్తోంది. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న ఈటల రాజేందర్‌కు పార్లమెంట్ ఇన్ఛార్జీతోపాటు ఇతర ముఖ్యనేతలు ఎవరూ సహకరించడం లేదు. ఈటేల రాజేందర్ మల్కాజిగిరిలో ఒంటరి పోరు చేస్తున్నారు. స్థానిక నాయకులు కూడా ప్రచారంలో అంతంత మాత్రంగానే పాల్గొంటున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిస్థితి మరీ ఘోరంగా మారింది. అభ్యర్థికి నేతలెవరూ సపోర్ట్ చేయడం లేదు. దీంతో పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జీ అభయ్ పటేల్ రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌తో ఆయన చర్చించారు. మాధవీలతకు సపోర్ట్ చేయాలని కోరి నట్లు సమాచారం. హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి విషయంలో రాజాసింగ్ ఆది నుంచి అసంతృప్తి తో ఉన్నారు. ఈనేపథ్యంలోనే అభయ్ పటేల్ రాజాసింగ్‌తో భేటీ అయినట్లు తెలుస్తోంది.
బీజేపీలోకి కొత్తగా వచ్చి, పార్లమెంట్ టికెట్లు దక్కించుకున్న అభ్యర్థుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. జహీరాబాద్ నుంచి పోటీ చేస్తున్న బీబీ పాటిల్, నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేస్తున్న భరత్, నల్గొండ నుంచి పోటీ చేస్తున్న సైది రెడ్డి, ఆదిలాబాద్ నుంచి పోటీ చేస్తున్న నాగేష్, పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, వరంగల్ నుంచి ఆరూరి రమేష్, వీళ్ళందరూ ఇతర పార్టీల నుంచి చివరి నిమిషంలో వచ్చి సీటును దక్కించుకున్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వీరికి పాత బీజేపీ క్యాడర్ నుంచి ఎలాంటి సహకారం అందడం లేదంటున్నారు. బీజేపీలో ఎప్పటి నుంచో పాతుకుపోయిన జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ ప్రభారీలు, కన్వీనర్లు సహాయ నిరాకరణ చేస్తున్నట్లు అభ్యర్థులు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకోచ్చారు. పార్టీ అధిష్టానం నేరుగా జోక్యం చేసుకోవడానికి ప్రత్యేక కార్యచరణ రూపొందించింది. అందుకోసం అభ్యర్థితోపాటు పార్టీ సీనియర్ నేతలతో సమన్వయకర్తల సమావేశాలు పార్లమెంట్ పరిధిలో నిర్వహి స్తోంది.


